నాన్‌వెజ్‌కు జనం స్వస్తి! దేశంలో పెరుగుతోన్న వెజిటేరియన్స్

by Shiva |   ( Updated:2025-01-29 02:57:46.0  )
నాన్‌వెజ్‌కు జనం స్వస్తి! దేశంలో పెరుగుతోన్న వెజిటేరియన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మారుతున్న ఆధునిక జీవనశైలిలో భాగంగా ఎన్ని జాగ్రత్తలు పాటించినా అనారోగ్యం దరిచేరడం ఖాయం.. తీసుకునే హెల్తీ డైట్ లో భాగంగా శాఖాహారమే ప్రధానం అనే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇండియాలో ఇటీవలి కాలంలో ఆహార అలవాట్లు, ప్రాధాన్యాల్లో స్పష్టమైన మార్పులు కన్పిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం వైపు మొగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు, గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వెజిటేరియన్ ఫుడ్ ను తీసుకోవడం స్టేటస్ గా కూడా భావించే సంపన్న కుటుంబాల సంఖ్య పెరుగుతుండడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుందని హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ డైటీషియన్ పేర్కొనడం గమనార్హం. ఆయా అంశాల ప్రాతిపదికన చూస్తే వెజిటేరియన్ల సంఖ్య 23 నుంచి 27 శాతం పెరిగినట్లు పలు ప్రభుత్వ సర్వేలు, అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

మాధ్యమాల ప్రభావం కూడా..

హైదరాబాద్ మొదలుకుని ముంబై, బెంగుళూరు, పుణె, గోవా వంటి చోట్ల పూర్తిస్థాయి శాఖాహార రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా శాఖాహార ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో ప్రజలు వెజిటేరియన్ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ద గేమ్ ఛేంజర్స్ వంటి డాక్యుమెంటరీలు శాఖాహారంపై అవగాహన, చైతన్యం పెరిగేందుకు దోహదపడ్డాయి. వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే సెలబ్రీటీలు కూడా వేగన్ ఫుడ్ ను ప్రమోట్ చేయడం, ఇప్పటికే కొందరు ఆయుర్వేద, ప్రక్రుతి వైద్య నిపుణులు రోజువారి కార్యక్రమాలతో టెలివిజన్ లలో ప్రసారం చేయడం, పత్రిక, టీవీ, సోషల్ మీడియా మాధ్యమాల ప్రభావమో కానీ పట్టణాల్లో కొందరు వీగన్ అంటూ డైట్ త్రుణ ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయల సలాడ్, పండ్లు మాత్రమే ఎక్కవ భాగం తమ డైట్ లో భాగం చేసుకుంటున్నారు. మాంసాహారం వినియోగంలో జరుగుతున్న కల్తీ దృష్ట్యా కొందరు వెజిటేరియన్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.

ఉత్తరాది ఆహారపు అలవాట్లు..

ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం జనాభా ఒక చోటు నుంచి మరొక చోటుకు మైగ్రేట్ అయినప్పుడు అక్కడి ఆహారపు అలవాట్లు వేరే వాళ్లకి కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇలా కారణాలు ఏవైనా ఇటీవల హైదరాబాద్ అనే కాకుండా మెట్రో పాలిటన్ సిటీల్లో అన్ని రాష్ట్రాల వెజిటేజియన్ ఫుడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. తాజా సర్వేలు, పరిశీలనలను బట్టి చూస్తే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో శాఖాహారులున్నారు. అక్కడి గ్రామీణ జనాభాలో రోజు వెజిటేరియన్ తీసుకోవడం తమ అనాదిగా వస్తున్న ఆహారపు అలవాట్లుగా చెబుతారు.

ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్ సూచనలు

ఇటీవల ఆరోగ్యకర శైలి కోసం ఐసీఎంఆర్ –ఎన్ఐఎన్ పలు సూచనలు చేసింది. అందులో భాగంగా చక్కటి పోషకాలుండే ఆహారపదార్థాలను డైట్లో చేర్చుకోంటూ, రోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి అని తెలిపింది. అంతేకాకుండా సీజనల్, పండ్లు కూరగాయలు డైట్ లో భాగం చేసుకుని రోజూ వ్యాయామం, ధ్యానం చేయాలని పేర్కొంది. శరీరం ఉత్తేజంగా ఉండటానికి సూర్యరశ్మిలో ఉంటూ స్క్రీన్ టైం తగ్గించుకోవాలని సూచించింది.

అధ్యయనం చేసి మరీ కొంటున్నారు..

ఆరోగ్యపరమైన ప్రయోజనాల పట్ల అవగాహన పెరగడంతో సూపర్ మార్కెట్, రెస్టారెంట్లతో పాటు ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ పైన వెజిటేరియన్ ఉత్పత్తులు విరివిగా అందుబాటులోకి రావడంతో వాటి లేబుల్స్ పై ఉన్న పోషకాల వివరాలు చూసి ఉత్పత్తులు కొనే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇండియాలో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అనేక రెట్లు పెరిగి 2022లో 1.3 బిలియన్ల మార్కెట్ వాల్యూను చేరుకుంది. 2010 నుంచి చూసినట్లయితే ఇండియాలో వీగన్ డైట్ పైన ఆన్లైన్ సెర్చ్ డేటా రెండింతలు పెరిగింది. యూ గావ్ సర్వే ప్రకారం శాఖాహార డైట్ వైపు మొగ్గు చూపేందుకు 59 శాతం మంది సంసిద్దత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.

Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి!

Advertisement

Next Story

Most Viewed