కరోనా కట్టడికి మార్గమే లేదా?

by Prasanna |
కరోనా కట్టడికి మార్గమే లేదా?
X

కలవరపెడుతున్న కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ను మార్గంగా ఎంచుకున్నాయి. చాలా దేశాలు విజయం సాధించాయి. మన దేశంలో మాత్రం సడలింపుల కారణంగా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలే లాక్‌డౌన్‌ను నీరుగార్చాయి. ప్రజలూ అంతే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. చివరకు కొవిడ్ నివారణ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పేరుతో ఆంక్షలను ఎత్తివేశారు. వైరస్ వ్యాప్తి నివారణను గాలికొదిలేశారు. కరోనాతో సహజీవనమే మార్గమన్నారు. చివరకు ఎవరికి వారే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకోవాల్సి వచ్చింది.

దిశ, న్యూస్ బ్యూరో: ప్రతి రోజూ వేలాది కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పాజిటివ్ లు, మరణాలు పెరిగిపోతుండడంతో ప్రజల్లో భయం మొదలైంది. భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన తలెత్తింది. ఈ పరిస్థితి నుంచి బయటపడడం ప్రభుత్వాలకూ సవాలుగా మారింది. పరిష్కారానికి దారేంటో తెలియక సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. తొలుత కట్టడి తప్పనిసరి అని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చింది. అప్పటికి దేశం మొత్తం మీద ఉన్న పాజిటివ్ కేసులు కేవలం 363. ఇందులో గరిష్టంగా మహారాష్ట్రలో 68, కేరళలో 55, ఢిల్లీలో 29, తెలంగాణలో 24. మార్చి 25న మొదటి లాక్‌డౌన్ అమలులోకి వచ్చేనాటికి దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 606. నాలుగు విడతల లాక్‌డౌన్ ముగిసిపోయి, ఐదో విడత అన్‌లాక్ అవుతున్న కాలంలో జూన్ 21 నాటికి కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ఈ మూడు నెలల కాలంలో కేసులు తగ్గకపోగా, వాటి సంఖ్య వందల నుంచి లక్షలకు చేరింది. ఢిల్లీ, ముంబయి, చెన్నయ్, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో వైరస్ వ్యాప్తి కష్టసాధ్యంగా మారింది.

క్రమక్రమంగా పెరుగుతూ

మొదటి విడత లాక్‌డౌన్‌ మూడు వారాల వ్యవధిలో పది వేల కంటే ఎక్కువే కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంక్షలను, నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసిన రాష్ట్రాల్లో కేసులు పెరగకుండా పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ తర్వాతి నుంచి క్రమంగా ఆంక్షలను సడలించడంతో కేసుల తీవ్రత కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రజలు సైతం విచ్చలవిడిగా రోడ్లమీదకు వచ్చి వైరస్ వ్యాప్తి పెరగడానికి కారణమయ్యారు. దేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైనప్పటి నుంచి లక్షకు చేరుకోడానికి 111 రోజులు పట్టింది. ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే లక్ష కేసుల స్థాయికి చేరుకుంది. మూడో లక్ష కేసులకు పది రోజులు, నాల్గో లక్ష కేసులకు ఎనిమిది రోజులే పట్టింది. ఇప్పుడు రోజూ పుట్టుకొస్తున్న కొత్త కేసుల తీవ్రతను గమనిస్తే వారం రోజుల లోపే మరో లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

అదుపు తప్పి..అందరికీ అంటి

మార్చి ఒకటినాటికి కేరళలో మూడు కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజల సహకారంతో వరుస చర్యలు తీసుకుంది. ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 140 రోజుల్లో మూడు వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మహారాష్ట్రలో తొలి కేసు మార్చి తొమ్మిదిన బయటకు వచ్చింది. మొదటి రోజు ఐదు కేసులు వచ్చాయి. వంద రోజుల్లోనే సుమారు 1.30 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో దాదాపు మూడవ వంతు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశం మొత్తం మీద చనిపోయినవారిలో దాదాపు సగం మంది ఇక్కడివారే. తమిళనాడులోనూ పరిస్థితి అదుపులో లేకుండాపోయింది. మొదటి కేసు మార్చి ఏడున నమోదైంది. ఇప్పుడు దేశంలోనే అతి ఎక్కువ కేసులున్న రెండవ రాష్ట్రంగా ఉంది. ముఖ్యమంత్రి ఆఫీసులోని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. ఒక ప్రముఖ ఆసుపత్రి అధినేత కూడా కరోనా చికిత్స ఫలించక చనిపోయారు. ఒక ఎమ్మెల్యే కూడా చనిపోయాడు. ఢిల్లీలో వైద్య మంత్రి ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న కరోనా చికిత్సకు స్పందించకపోవడంతో, ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. సామాన్యులు మొదలుకొని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. చివరకు దేశ సరిహద్దులో ఉండే సైన్యం, వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పారా మిలిటరీ బలగాల వరకూ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురికాక తప్పలేదు.

ఆర్థిక వెసులుబాటు కోసం సడలింపులు

తొలుత ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పేరుతో ఆంక్షలకు తిలోదకాలు ఇచ్చి సడలింపుల బాట పట్టాయి. ఫలితంగా వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. చివరకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ‘కరోనాతో సహజీవనం తప్పదు’ ‘మందు లేదా వైరస్ వచ్చేదాక తిప్పలు తప్పవు’ ‘ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. అంటూ ప్రభుత్వాలు కొత్త పాటలు మొదలు పెట్టాయి. వైరస్ ఎంత భయంకరమైందో, దాని బారిన పడితే ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర సౌకర్యాలతో ఎన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందో, చికిత్స ఫలించక చనిపోతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లముందు కనిపిస్తున్న అనుభవాలతో ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలకు ఉపక్రమించారు. ఆమనగల్లు పట్టణంలో స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకున్నారు. కొనుగోలుదారులు సోషల్ డిస్టెన్స్‌ నిబంధనను గాలికొదిలేయడంతో హైదరాబాద్‌లోని బేగం బజార్‌ వ్యాపారులు సంఘంగా ఏర్పడి దుకాణాల వేళలపై ఆంక్షలు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో వైరస్ ఎక్కువ ఉండడంతో, అక్కడి నుంచి వచ్చేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కొన్ని గ్రామాల ప్రజలు సొంతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కొన్ని పంచాయతీల వ్యాపారులు పగటి వరకే దుకాణాలను మూసేయాలని నిర్ణయించుకున్నారు. కొన్నిచోట్ల హెయిర్ కటింగ్ సెలూన్‌లను నెల రోజుల పాటు మూసివేయాని తీర్మానించుకున్నారు.

దేశంలో ఇదీ పరిస్థతి

మొదటి లాక్‌డౌన్ (మార్చి25 – ఏప్రిల్14) : 606 కేసుల నుంచి 10,085 వరకు
రెండవ లాక్‌డౌన్ (ఏప్రిల్15- మే3) : 11,933 కేసుల నుంచి 40,263 వరకు
మూడవ లాక్‌డౌన్ (మే4 – మే17) : 42,836 కేసుల నుంచి 90,927 వరకు
నాల్గవ లాక్‌డౌన్ (మే18 – మే31) : 96,169 కేసుల నుంచి 1,82,143 వరకు
ఐదవ లాక్‌డౌన్ (జూన్1 – జూన్30) : 1,90,535 కేసుల నుంచి 4,10,461 వరకు (21 నాటికి)

తెలంగాణలోనూ అదే స్థితి

మొదటి కేసు : మార్చి 2
మొదటి లాక్‌డౌన్ ముగింపు నాటికి (ఏప్రిల్ 14) : 644 కేసులు
రెండో లాక్‌డౌన్ (మే 3 నాటికి) : 1,082
మూడో లాక్‌డౌన్ (మే 17 నాటికి) : 1,551
నాల్గవ లాక్‌డౌన్ (మే 31 నాటికి) : 2,698
ఐదవ లాక్‌డౌన్ (జూన్ 21 నాటికి) : 7,802

Advertisement

Next Story