కేసీఆర్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. అలా చేస్తే ప్రజాజీవితం నుంచి తప్పుకుంటా

by Anukaran |   ( Updated:2021-08-28 07:31:30.0  )
కేసీఆర్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. అలా చేస్తే ప్రజాజీవితం నుంచి తప్పుకుంటా
X

దిశ, జగిత్యాల : ఏడేళ్లలో దళితులకు, గిరిజనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి వారిని దోపిడీకి గురిచేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు ఆధ్వర్యంలో దళిత, గిరిజన హక్కుల సాధనకోసం సత్యాగ్రహ దీక్ష చేపట్టగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. దళితులకు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడమే కాకుండా సంక్షేమం పట్ల చిన్న చూపు చూస్తోందన్నారు. ఏడేళ్లల్లో దళితుల అభివృద్ధి నిధులలో రూ.86 వేల కోట్ల నుంచి రూ.51 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, మిగతా 31 వేల కోట్లను సంక్షేమానికి వెచ్చించకపోవడంతో అవి రద్దు చేయబడ్డాయని జీవన్ రెడ్డి అన్నారు.

ఇదేనా దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రూ.51 వేల కోట్లనుండే దళితులకు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఫీజు రియంబర్స్‌మెంట్ వంటివి అందజేశాడే తప్పా, వారికీ కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందేమి లేదన్నారు. ఉన్నత, బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ నిధి లేకున్నా రైతు బంధు, రైతు బీమా, ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారని, అలాగే దళితుల అభివృద్ధికోసం వేల కోట్ల నిధులున్నా ఖర్చుచేయకుండా కేసీఆర్ వారిని మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు ప్రకటించడం కాదు, రాష్ట్రంలోని దళితులందరికీ ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 35 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 5 వేల చొప్పున ఇండ్ల నిర్మాణాలు చేయవచ్చని లెక్కలతో సహా వివరించారు. దళితులకు, బలహీన వర్గాలకు ఏడేళ్లలో ఎన్ని ఇండ్లు కట్టించావని ప్రశ్నించారు. సమాజంలో దళితుల మీద ఈర్ష్యభావం పెంపొందేలా కేసీఆర్ కుట్ర పన్నారని దళితులు గమనించాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి కోసం కేటాయించబడ్డ 35 వేల కోట్లు ఖర్చుచేసి దళితులను ఓట్లు అడగాలని జీవన్ రెడ్డి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల ఎకరాల భూపంపిణీ చేస్తే, ఒక్క దళితులకే లక్షన్నర ఎకరాల భూమి పంపిణీ చేసి దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇండ్లులేని దళితులు, బలహీన వర్గాలకు గృహవసతి కల్పించిందని చెబుతూ, ఇందిరమ్మ ఇళ్ల కాలనీ లేని గ్రామం లేదని, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పాటుపడిందని, నీవు ఎన్ని జన్మలెత్తిన కాంగ్రెస్ చేసిన సంక్షేమాన్ని చేపట్టాలేవని హితవు పలికారు. ఒకవేళ ఇందిరమ్మ కాలనీ లేని గ్రామం లేకపోతే ప్రజాజీవితం నుంచి తప్పుకుంటానని జీవన్ రెడ్డి సీఎం కు సవాల్ చేశారు. కేసీఆర్ వాస్తవాలను వక్రీకరిస్తూ కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించడం కళ్లుండి చూడలేని కబోదిలా ఉందని ఎద్దేవా చేశారు. ఇకనైనా మిగిలి ఉన్న రెండేళ్లలో మంచి పనులు చేసి ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. దీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, వీరబత్తిని శ్రీనివాస్, బాపు రెడ్డి, లైశెట్టి విజయ్, మహిపాల్, మున్నా, రజినీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story