Ola Electric: 4,000 స్టోర్‌లతో ఓలా ఎలక్ట్రిక్ పాన్-ఇండియా విస్తరణ

by S Gopi |
Ola Electric: 4,000 స్టోర్‌లతో ఓలా ఎలక్ట్రిక్ పాన్-ఇండియా విస్తరణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈవీ టూ-వీలర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ పాన్-ఇండియా స్థాయిలో నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి సారించింది. గత కొంతకాలంగా కంపెనీ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలపై పెరిగిన ఫిర్యాదుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కొత్తగా 3,200 స్టోర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. దీంతో ప్రస్తుతం కంపెనీ స్టోర్ల సంఖ్య 4,000 కు పెరిగిందని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్ చెప్పారు. తాజా విస్తరణ ద్వారా కంపెనీ ప్రధానంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ కంపెనీ సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం. అమ్మకాలతో పాటు ఆ తర్వాత కస్టమర్లకు సేవలందించడంపై ఎక్కువ దృష్టి సారిస్తామని, ఓలా డైరెక్ట్-టూ-కన్స్యూమర్(డీ2సీ) మోడల్ కింద ప్రతి ఇంటికి ఈవీ ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరించింది. ఈ సందర్భంగా కంపెనీ తన ఓలా ఎస్1 స్కూటర్లపై రూ. 25 వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. కాగా, ఈ ఏడాదిలోనే ఓలా స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టింది. ఇదే సమయంలో కంపెనీ రెగ్యులేటరీ సమస్యలు, కస్టమర్ ఫిర్యాదులు, ఉత్పత్తి నాణ్యతపై సందేహాలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంది. వీటి పరిష్కారంలో భాగంగానే ఓలా ఎలక్ట్రిక్ దూకుడుగా నెట్‌వర్క్ విస్తరణ, ఇతర చర్యలను మొదలుపెట్టింది.

Advertisement

Next Story

Most Viewed