మేమున్నాం…

by Shamantha N |
మేమున్నాం…
X

– రైలు ప్రయాణ ఖర్చులు భరిస్తాం
– వలస కార్మికులకు కాంగ్రెస్ భరోసా
– పీసీసీలకు అధిష్టానం ఆదేశం
– సోనియాగాంధీ మాస్టర్ స్ట్రోక్

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘మాస్టర్ స్ట్రోక్’ ప్రయోగించింది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘మేమున్నాం’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆపన్నహస్తం అందించింది. రైలు ప్రయాణ ఛార్జీలకు, ఆహారపు అవసరాలకు ఇబ్బంది అవసరం లేదన్న భరోసాను కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీలకు వలస కార్మికులను ఆదుకునే బాధ్యతను అప్పజెప్పారు. ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శిస్తూ కార్మికుల హృదయాలను గెల్చుకునే ప్రయత్నం చేశారు. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వ్యక్తిగతంగా కోటి రూపాయలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సోనియాగాంధీ ఇప్పుడు దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావించారు. గత ఆరేళ్ళుగా ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో చూరగొనలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా దగ్గరయ్యేందుకు చొరవ తీసుకుంది. గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం లాంటి సంచలన నిర్ణయాలను ప్రభుత్వపరంగా తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు విపక్ష పార్టీ హోదాలో ప్రజలకు నైతిక భరోసా కల్పించే వ్యూహాత్మక ఎత్తుగడకు పూనుకుంది.

కేంద్రంపై సోనియా ఆగ్రహం

”విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల్ని స్వంత ఖర్చుతో ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చినప్పుడు గుజరాత్‌లో కేవలం ఒక్క కార్యక్రమం కోసం రూ. 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. బస్సుల్ని పెట్టడంతో పాటు వారికి తిండి ఏర్పాట్లు చేసింది. రైల్వే మంత్రిత్వశాఖ తరఫున ఉద్యోగుల వేతనాల నుంచి రూ. 151 కోట్లు ప్రధాని సహాయ నిధి (పీఎంకేర్స్)కి సమకూరింది. కానీ, ఈ కూలినాలి పనులు చేసుకునే వలస కార్మికులకు మాత్రం ఎందుకింత కష్టం వచ్చింది? వారు ఈ జాతి నిర్మాణంలో భాగస్వాములు కారా? వీరి రైలు ప్రయాణ, తిండి అవసరాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయిందా?” అని సోనియాగాంధీ ప్రశ్నించారు.

”వలస కార్మికుల కష్టాలను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. వారి కష్టాలకు పరిష్కారం చూపాలని కోరింది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైల్వే శాఖ పెడచెవిన పెట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే స్వయంగా వలస కార్మికుల బాధ్యతను భుజాన వేసుకుంటున్నది. ప్రతీ రాష్ట్రంలోని పీసీసీ అక్కడి వలస కార్మికుల ప్రయాణానికి అవసరమైన రైలు టికెట్ ఛార్జీ తదితర అవసరాలను చూసుకుంటుంది. ఈ దేశ పౌరులుగా, జాతి అభివృద్ధి రాయబారులుగా భావించే శ్రామికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది” అని సోనియాగాంధీ పేర్కొన్నారు.

మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక..

”కార్మికులు, శ్రామికులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వారి కఠిన శ్రమ, త్యాగం మన దేశానికి పునాది. కేవలం నాలుగు గంటల నోటీసుతో లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు సొంతూళ్ళకు చేరుకునే అవకాశం ఇవ్వలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంతటి హృదయ విదారకమైన పరిస్థితిని చూస్తున్నాం. కొన్ని వేల మంది వలస కార్మికులు కాలి నడకనే వేలాది కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. వారి చేతిలో డబ్బుల్లేవ్, తిండి లేదు, రవాణా సౌకర్యం లేదు, మందులు లేవు… కానీ, సొంతింటికి చేరుకోవాలన్న లక్ష్యం, పట్టుదల మాత్రం బలంగా ఉంది. ప్రభుత్వం నిస్సహాయంగా ఉన్నా సామాజిక బాధ్యత కలిగిన పౌరులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మాత్రం అండగా నిలిచాయి” అని సోనియాగాంధీ పేర్కొన్నారు.

ఆత్మరక్షణలో బీజేపీ

కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం అధికార బీజేపీకి మింగుడు పడలేదు. అందుకే గంటల వ్యవధిలోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. వలస కార్మికులకు ఒక్క పైసా కూడా భారం పడకుండా 85% టికెట్ ఛార్జీని కేంద్ర ప్రభుత్వం.. మిగిలిన 15% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయన్నారు. కానీ, విదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఉచిత రవాణా కల్పించి ప్రత్యేక విమానాలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వలస కార్మికుల విషయంలో భిన్నంగా స్పందించడం ఇప్పుడు విమర్శలకు కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఎంత మంది వలస కార్మికులను ఆదుకోగలుగుతుంది, ఏ మేరకు ఈ హామీ నెరవేరింది అనే అంశాలపై బీజేపీ మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రశ్నిస్తే అది రాజకీయ రంగు పులుముకుంటుంది. ప్రభుత్వ బాధ్యత అనే కోణాన్ని తెరపైకి తెచ్చి ఇప్పటికిప్పుడు మొత్తం రైలు టికెట్ ఛార్జీని కేంద్రమే భరించినా అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందునే అనే అపవాదును మూటగట్టుకోవాల్సి ఉంటుంది. సోనియాగాంధీ తీసుకున్న ‘మాస్టర్ స్ట్రోక్’ నిర్ణయం ఇప్పుడు బీజేపీకి సంకట పరిస్థితిని తీసుకొచ్చింది. కక్కలేని, మింగలేని పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించింది.

tags: Migrant Workers, Congress, Sonia Gandhi, PCC Chiefs, Railway Tickets

Advertisement

Next Story