కృష్ణమ్మ పరవళ్లు.. కడప రైతుల్లో ఆనందం

by srinivas |
కృష్ణమ్మ పరవళ్లు.. కడప రైతుల్లో ఆనందం
X

దిశ ప్రతినిధి, కడప: కృష్ణా జలాల ఆధారంగా గాలేరు -నగరి ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన కడప జిల్లాలో అతి పెద్ద రిజర్వాయరుగా ఉన్న గండికోట రిజర్వాయర్ నిండుగా దండిగా జలకళ సంతరించుకుంది. కృష్ణా జలాలతో తొణికిసలాడుతోంది. రిజర్వాయర్ నిర్మించిన తర్వాత మొదటిసారి 2020లో జగన్ ప్రభుత్వంలో ఒకసారి 26 టీఎంసీలకు పైగా నీరు నింపారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఇప్పుడు 25.5 టిఎంసి నీరు శుక్రవారం ఉదయానికి చేరుకుంది. ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఈ మేరకు నీటి నిలువ ఉంచే యోచనలో నీటిపారుదల అధికారులు ఉన్నారు.

అన్నదాతల్లో ఆనందం...

గండికోట రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసిలు కాగా ఇప్పటికే 25.5 టీఎంసీలు చేరుకోవడంతో రిజర్వాయర్ నిండు కుండలా కనిపిస్తోంది. కృష్ణాజలాలు కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి వరదకాలువల ద్వారా ఇప్పటికీ 10,900 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండడంతో మైలవరంతోపాటు గండికోట ఎత్తిపోతల పథకాలకు గ్రావిటీ ద్వారా నిర్మించిన రెండు ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. గండికోట రిజర్వాయర్‌ను దాదాపు పూర్తి సామర్థ్యంతో నీటిని నింపడంతో గండికోట నుండి సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్లకు ఎత్తిపోతల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుండడంతో గండికోట అనుబంధ రిజర్వాయర్లతో పాటు దిగువ భాగంలో ఉన్న మైలవరం రిజర్వాయర్‌లో ఆయకట్టు రైతుల్లో ఆనంద వ్యక్తమవుతోంది.

పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ..

వైయస్సార్ కడప జిల్లాలోని ప్రాజెక్టులకు కృష్ణజలాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. కృష్ణా జలాల ఆధారంగా జిల్లాలో గాలేరు- నగిరి , తెలుగు గంగ రిజర్వాయర్లు నిర్మించారు. వీటికి అంతర్భాగంగా పలు రిజర్వాయర్లు నిర్మించారు. వీటిలో గండికోట రిజర్వాయర్‌ను పెద్ద రిజర్వాయర్‌గా చెప్పుకోవాలి. 26.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లో 2020లో 26 టీఎంసీ నీటిని నింపారు. అయితే అప్పట్లో పూర్తిగా కృష్ణాజలాలే కాకుండా ఎగువ ప్రాంతాల నుంచి పెన్నానదికి చేరే వరద ప్రవాహంతో కూడా నింపారు. అప్పట్లో ఈ నీరు గండికోటకు మరింత తోడైంది.

Advertisement

Next Story

Most Viewed