సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్.. కారు సీట్ల కింద రహస్యంగా ఏర్పాటు

by Aamani |
సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్.. కారు సీట్ల కింద రహస్యంగా ఏర్పాటు
X

దిశ,సంగారెడ్డి అర్బన్ : సినిమాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను ఒక చోట నుండి ఇంకో చోటికి ఎలా స్మగ్లింగ్ చేస్తారో, సేమ్ అలాంటి సన్నివేశమే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. సఫారీ కారులో సీట్ల కింద రహస్యంగా 83.4 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నిందితున్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కారు సీట్ల కింద రహస్యంగా ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఇటవాకిలి గ్రామానికి చెందిన అష్రఫ్ ఈ నెల 26న ఐవోబి నుంచి ఒంటరిగా సఫారీ వాహనంలో మహారాష్ట్ర వైపుకు బయలుదేరాడు. అతడు ప్రయాణిస్తున్న సఫారీ లోని వెనుక భాగం సీట్ల కింద రహస్యంగా, బయటికి కనపడకుండా 83.4 కిలోల గంజాయి ప్యాకెట్లను అమర్చాడు. ముందస్తు సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాంధీ నాయక్, అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు సీటు కింద అక్రమంగా తరలిస్తున్న 83.4 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

వీటి విలువ 33.50 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ మేరకు నిందితుడైన అష్రఫ్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి అక్రమ గంజాయితో పాటు, ఓ కారును స్వాధీన పరుచుకున్నారు. ఎవరైనా అక్రమంగా గంజాయి తరలిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ నవీన్ చంద్ర సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed