మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన ప్రెసిడెంట్

by karthikeya |
మాల్దీవుల్లో యూపీఐ సేవలు.. ప్రకటించిన ప్రెసిడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్నమొన్నటివరకు ఇండియాతో కయ్యానికి కాలు దువ్విన మాల్దీవ్స్ ఇప్పుడు ఉన్నట్లుండి ఇండియాకి దగ్గరవ్వడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌లో సూపర్‌ సక్సెస్ అయిన డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్)ని తమ దేశంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం మాల్దీవుల క్యాబినెట్ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ తమ దేశంలో యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తమ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. భారతదేశం తమ డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్‌పర్టీస్‌ను పంచుకున్న తర్వాత మాల్దీవ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఈ ప్రతిపాదనకు ఆదివారం ఆమోదం తెలిపారు.

యూపీఐ అమలు ద్వారా మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థను విస్తరించడం, లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం, దేశపు డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ముయిజ్జు భావిస్తున్నారు.

ఆర్థిక సంస్కరణలపై చర్చించిన కేబినెట్:

ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రి ప్రతిపాదించిన నివేదికపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు ముయిజ్జు తెలిపారు. దీనికోసం బ్యాంకులు, టెలికం సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలను కలుపుకుని ముందుకు పోయేలా ఓ కన్సార్టియంను ఏర్పాటు చేయాలని కూడా ముయిజ్జు ప్రతిపాదించారట.

యూపీఐని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ఆదేశించారు. ఈ బృందానికి ఆర్థిక అభివృద్ధి, వాణిజ్య మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తుంది. దీంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు మాల్దీవుల మాన్యుటరీ అథారిటీ కూడా ఈ బృందంలో ఉంటాయి.

ఇప్పటికే ప్రారంభమైన RuPay కార్డ్ సేవలు:

భారతదేశం, మాల్దీవుల మధ్య డిజిటల్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ నెల ప్రారంభంలో మాల్దీవుల్లో RuPay కార్డు సేవను ప్రారంభించారు. దీని వల్ల భారతీయ పర్యాటకులు మాల్దీవుల్లో చెల్లింపులు చేయడం సులభం అవుతుంది.

ఇప్పటికే అనేక దేశాల్లో పనిచేస్తున్న యూపీఐ:

2023 ఆగస్టులో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటన సందర్భంగా యూపీఐ అమలు కోసం భారతదేశం మాల్దీవుల మధ్య ఒప్పందం కుదిరింది. యూపీఐ వ్యవస్థ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, ఫ్రాన్స్, మలేషియా, మారిషస్, సింగపూర్, నేపాల్, యుకే వంటి అనేక దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా ఇప్పటికే పనిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed