ముగిసిన ఐపీఎల్ వేలం.. ఎంత మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయో తెలుసా?

by Harish |
ముగిసిన ఐపీఎల్ వేలం.. ఎంత మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : తొలి రోజు పంత్, అయ్యర్ వంటి స్టార్లు ఐపీఎల్ వేలం రికార్డులను బద్దలు కొడితే.. రెండో రోజు కుర్రాళ్ల పంట పండింది. ఫ్రాంచైజీలు యువ క్రికెటర్లపై కోట్లు కుమ్మరించాయి. పలువురిని ఊహించని ధర పలికింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కుర్రాళ్లు కోటీశ్వరులయ్యారు. రెండో రోజు సీనియర్ పేసర్ భువనేశ్వర్ రూ.10.75 కోట్లతో అత్యధిక ధర పలికాడు. అలాగే, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, అశుతోష్ శర్మ, రఘువంశీ, రసిఖ్ దర్ వంటి యువకులు భారీ ధర పలికారు.

రెండురోజుల పాటు సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం సోమవారం ముగిసింది. 204 బెర్త్‌ల కోసం వేలం నిర్వహించగా 577 మంది ప్లేయర్లు పోటీపడ్డారు. అందులో 182 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అందులో 62 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. తొలి రోజు 72 మంది అమ్ముడవ్వగా.. రెండో రోజు 110 మందిని ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఫ్రాంచైజీలు మొత్తం రూ.639.15 కోట్లు కుమ్మరించాయి. రెండో రోజు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అత్యధిక ధర పలికాడు. అతన్ని బెంగళూరు రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, ఫ్రాంచైజీలు రెండో రోజు వేలంలో కుర్రాళ్లపై ఫోకస్ పెట్టాయి. యువ పేసర్ ఆకాశ్ దీప్‌ కోసం లక్నో రూ. 8 కోట్లు పెట్టింది. 2022 వేలంలో ఆర్సీబీ అతన్ని రూ. 20 లక్షలకే తీసుకుంది. మరో యువ పేసర్ రసిఖ్ ధర్‌‌కు భారీ ధర దక్కింది. అతన్ని రూ. 6 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో సత్తాచాటిన అశుతోష్ శర్మ‌ను రూ.3.80 కోట్లకు ఢిల్లీ, రఘువంశీని రూ. 3 కోట్లకు కోల్‌‌కతా జట్టులోకి తీసుకున్నాయి. బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను చెన్నయ్ రూ3.40 కోట్లకు దక్కించుకుంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వీరి పంట పండింది. అయితే, భారీ ధర పలుకుతాడనుకున్న వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ రూ.3.2 కోట్లకే దక్కించుకుంది. డు ప్లెసిస్‌ కోసం ఆర్సీబీ ఆర్‌టీఎం వాడలేదు. అతన్ని ఢిల్లీ రూ. 2 కోట్లకు తీసుకుంది. కృనాల్ పాండ్యాను రూ. 5.75 కోట్లకు ఆర్సీబీ, నితీశ్ రాణాను రూ 4.2 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేశాయి. విదేశీ ప్లేయర్లలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్(రూ. 7కోట్లు, పంజాబ్) రెండో రోజు అత్యధిక ధర పలికాడు.

ఎస్‌ఆర్‌హెచ్, భువీ బంధానికి తెర

సన్‌రైజర్స్ హైదరాబాద్‌, భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మధ్య బంధానికి తెరపడింది. భువీ దశాబ్దంపాటు ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళాన్ని నడిపించాడు. 2014 నుంచి ఈ ఏడాది వరకు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, హైదరాబాద్ భువీని వేలంలోకి వదిలివేయడంతోపాటు ఆక్షన్‌లోనూ తిరిగి తీసుకోలేదు. అయితే వేలంలో భువీ జాక్‌పాట్ కొట్టాడు. అతన్ని ఆర్సీబీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన భువీ కోసం మొదట ముంబై, లక్నో పోటీపడ్డాయి. రూ. 10.25 కోట్ల తర్వాత ముంబై తప్పుకోగా.. లక్నో రూ 10.50 కోట్ల బిడ్ వేసింది. అయితే, బెంగళూరు రూ.10.75 కోట్ల బిడ్ వేసి భువీని దక్కించుకుంది. రెండో రోజు భువీదే హయ్యెస్ట్ బిడ్. 2022 వేలంలో హైదరాబాద్ అతని కోసం రూ 4.2 కోట్లు మాత్రమే వెచ్చించగా.. దానితో పోలిస్తే ఈ సారి 156 శాతం అధిక ధర పలకడం విశేషం.


Advertisement

Next Story

Most Viewed