Telecom Industry: టెలికాం కంపెనీలకు భారీ ఊరట.. బ్యాంక్ గ్యారెంటీల మాఫీకి కేబినెట్ ఆమోదం

by S Gopi |
Telecom Industry: టెలికాం కంపెనీలకు భారీ ఊరట.. బ్యాంక్ గ్యారెంటీల మాఫీకి కేబినెట్ ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2022 వరకు స్పెక్ట్రమ్ కొనుగోళ్ల కోసం టెలికాం కంపెనీలు అందించాల్సిన బ్యాంక్ గ్యారెంటీలను (బీజీ) రద్దు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రూ. 30,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి బకాయిపడిన ప్రధాన టెలికాం కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అన్ని టెలికాం కంపెనీలకు, వాటి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా బ్యాంక్ గ్యారెంటీల మాఫీ విషయంలో సమానంగా ఉండేలా చూడాలని టెలికాం విభాగం(డీఓటీ) కోరింది. తాజా నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ. 20,000 కోట్లకు పైగా బకాయి ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాకు ఎక్కువ ప్రయోజనం చేకూరవచ్చు. వొడాఫోన్ ఐడియా తన స్పెక్ట్రమ్ చెల్లింపుల వ్యవహారంలో బ్యాంక్ గ్యారెంటీల అవసరాన్ని తొలగించేందుకు ప్రభుత్వ సహాయాన్ని కోరింది. దీనివల్ల బ్యాంకులు వారికి మరింత క్రెడిట్‌ను అందించడానికి వీలుంటుందని, తద్వారా కొంత ఆర్థిక ఉపశమనం లభిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది. ఆగస్టులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కూడా 2022కి ముందు జరిగిన వేలం కోసం బ్యాంక్ గ్యారెంటీలను తొలగించాలని డీఓటీని సంప్రదించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed