శ్రీలంక ఆర్థిక సంక్షోభం: తమిళనాడు తీరానికి చేరుకున్నమొదటి బ్యాచ్ శరణార్థులు

by Sumithra |
శ్రీలంక ఆర్థిక సంక్షోభం: తమిళనాడు తీరానికి చేరుకున్నమొదటి బ్యాచ్ శరణార్థులు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కేవ‌లం రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఓ యుద్ధం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతోంది. అందులో భాగంగానే, ప్ర‌స్తుతం, శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకొన్ని రోజుల్లో అక్క‌డ‌ తీవ్ర‌మైన క‌రువు ఏర్ప‌డుతుంద‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 16 మంది శ్రీలంక పౌరులు మార్చి 22న భారత తీరానికి చేరుకున్నారు. 16 మందిలో ఆరుగురు, పది మంది చొప్పున రెండు బ్యాచ్‌లు తమ పడవలపై కఠోర ప్రయాణం చేసి రామేశ్వరంలోని ధనుష్కోటికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు సముద్రంలో చిక్కుకుపోయారు. కాగా, మార్చి 22, మంగళవారం భార‌త కోస్ట్ గార్డ్ అధికారులు వారిని రక్షించారు. మరో పది మంది వ్యక్తులు మంగళవారం అర్థరాత్రి భారతదేశ తీరానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

మొద‌టి బృందంలోని ఆరుగురు వ్యక్తులు.. గజేంద్రన్ (24), అతని భార్య మేరీ క్లారిన్ (22), 4 నెలల కుమారుడు; టియోరి అనిస్తాన్ (28), ఆరు, తొమ్మిది సంవత్సరాల వయస్సు గల ఆమె పిల్ల‌లు ఇద్దరు ఉన్నారు. ఇక‌, రెండో గ్రూపు వివ‌రాల‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే, ఆరుగురు వ్యక్తులతో కూడిన మొదటి బ్యాచ్ పడవ ద్వారా ధనుష్కోటి వద్ద దిగాల్సి ఉండ‌గా, ప‌డ‌వ ఇసుక దిబ్బ‌పై చిక్కుకోవ‌డంతో, వారిని పడవలో తీసుకెళ్లడానికి అంగీకరించిన వ్యక్తి బలవంతంగా మార్గమధ్యంలో దింపాడు. పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిని రక్షించి, ఒడ్డుకు చేర్చి, విచారణ చేపట్టారు. గ‌జేంద్ర‌న్ త‌మిళ‌నాడులోని ఈరోడ్‌కు చెందిన వాడిగా అత‌ని భార్య మేరీ క్లారిన్ తెలిపింది. ఈ శ‌ర‌ణార్థులంతా శ్రీలంక‌లోని జాఫ్నా, కొకుపడయాన్ నివాసితులని విచారణలో నిర్ధారించారు. మొత్తం ఆరుగుర్ని మండపం హోవర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత, వారిని మండపం తీర భద్రతా బృందానికి అప్పగించారు.

ఇక‌, పది మందితో కూడిన రెండో బృందం ఫైబర్ బోట్‌లో సోమవారం రాత్రి మన్నార్ తీరం నుంచి బయలుదేరిన‌ట్లు అధికారులు తెలిపారు. పాంబ‌న్ వంతెన‌కు చేరుకోవాల్సిన వీళ్లు పడవలో సాంకేతిక సమస్య తలెత్తడంతో, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సముద్రం మధ్యలో ఒక రోజు గడపవలసి వచ్చింది. ధనుష్కోటి చేరుకున్న మొదటి బృందంలో ఒక మహిళ విలేఖరులతో మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం భారీగా పెర‌గ‌డంతో ఇంటి నిర్వ‌హ‌ణ భారంగా మారింద‌ని, అందుకే భారతదేశానికి చేరుకున్నామ‌ని చెప్పారు. "ఆహారం, ఇంధనంలో తీవ్రమైన కొరత ఏర్ప‌డ‌టం, అలాగే, ఆదాయ కొరత కారణంగా చాలా కుటుంబాలు భారతదేశానికి రావ‌డానికి మార్గాలను వెదుకుతున్నాయి" అని వారు తెలిపారు.

Advertisement

Next Story