NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్‌గా రామసుబ్రమణియన్‌.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

by vinod kumar |
NHRC: ఎన్‌హెచ్‌ఆర్‌సీ చీఫ్‌గా రామసుబ్రమణియన్‌.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చీఫ్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీ.రామసుబ్రమణియన్ (Ramasubramaniyan) నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల18న ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ను నియమించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ సమావేశమై కొత్త పేరును ఆమోదించింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. గతంలోఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా ఉన్న అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అయితే ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలు విజయ భారతి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా రామసుబ్రమణియన్ నియామకంతో ఆ పదవి భర్తీ అయింది. ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.

కాగా, రామసుబ్రమణియన్ తమిళనాడులోని మన్నార్గుడికి చెందిన వ్యక్తి. మద్రాసులోని న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 2006లో మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009లో శాశ్వత న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపాయిట్ కాగా.. 2023లో పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్ఆర్‌సీ చీఫ్‌గా నియామకమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed