షమీ కోలుకున్నాడు కానీ.. ఫిట్‌గా లేడు : బీసీసీఐ

by Harish |
షమీ కోలుకున్నాడు కానీ.. ఫిట్‌గా లేడు : బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి సమయం పట్టేలా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఖరి రెండు టెస్టులకు అందుబాటులోకి వస్తాడని వార్తలు వచ్చినా.. ఫిట్‌నెస్ సాధించని కారణంగా ఆ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బీసీసీఐ సోమవారం షమీ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగతా రెండు టెస్టులు ఆడేందుకు కావాల్సిన ఫిట్‌‌నెస్ షమీ సాధించలేదని తెలిపింది. అందుకే, అతన్ని ఆస్ట్రేలియాకు పంపలేమని పేర్కొంది. ‘సర్జరీ నుంచి కోలుకోవడం, పునరావాసంలో భాగంగా షమీతో కలిసి బీసీసీఐ మెడికల్ టీమ్ పనిచేస్తోంది. షమీ మడమ సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ, చాలా కాలం తర్వాత పెరిగిన అదనపు బౌలింగ్ వర్క్ లోడ్ కారణంగా అతని ఎడమ మోకాలికి వాపు వచ్చింది. నవంబర్‌లో మధ్యప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌లో బెంగాల్‌‌కు ఆడిన అతను 43 ఓవర్లు వేశాడు. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 9 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే, టెస్టు మ్యాచ్‌లకు సిద్ధం కావడానికి అదనపు బౌలింగ్ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో బౌలింగ్ వర్క్ లోడ్ కారణంగా అతని ఎడమ మోకాలికి వాపు వచ్చింది. షమీ మోకాలిపై బౌలింగ్ లోడ్‌‌ను నియంత్రించడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలోని మిగతా రెండు టెస్టులకు అతను ఫిట్‌గా లేడని మెడికల్ టీమ్ అంచనా వేసింది. సుదీర్ఘ ఫార్మాట్‌కు అందుబాటులోకి రావడానికి మెడికల్ టీమ్ పర్యవేక్షణలో షమీ పనిచేస్తాడు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడం అతని మోకాలి పురోగతిపై ఆధారపడి ఉంది.’ అని బీసీసీఐ తెలిపింది.


Advertisement

Next Story

Most Viewed