దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో పైకి ఎదగాలి : మంత్రి సీతక్క

by Kalyani |
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో పైకి ఎదగాలి : మంత్రి సీతక్క
X

దిశ, ములుగు ప్రతినిధి: వైకల్యం శరీరానికే మనస్సుకు కాదని, దివ్యాంగులు ఆత్మస్థైర్యం తో పైకి ఎదగాలని, దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ లతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… వైకల్యం అనేది శరీరానికే కాని మనస్సుకు కాదని, దివ్యాంగులు సాధారణ వ్యక్తుల కంటే ఎంతో అసాధారణ ప్రతిభావంతులు అన్నారు. వారు దృష్టి పెడితే సాధించలేనిది ఏదీ లేదని కొనియాడారు.

దివ్యాంగులు గొప్ప త్యాగ గుణం కలవారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వారు ఆత్మస్థైర్యం తో పైకి ఎదగాలని, వాళ్ళ కాళ్లపై వారు నిలబడేలా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ఒక ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, బైక్ లు, లాప్ టాప్ లు, వినికిడి యంత్రాలు వంటి వివిధ ఉపకరణాలను అందించడం జరుగుతుందని, అందులో భాగంగా అలింకో సంస్థ ద్వారా దాదాపు రూ. 63 లక్షల విలువచేసే సహాయ పరికరాలను కూడా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందని, వారికి కేటాయించిన కోటా ప్రకారం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులపై సమాజంలో ఇప్పటికీ కొంత చిన్న చూపు ఉందని, ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వారితో ప్రేమగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం మంత్రి సీతక్క దివ్యాంగుల క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించిన విజేతలను సన్మానించి వారికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆయా సంఘాల జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ (రెవెన్యూ), సంపత్ రావు (స్థానిక సంస్థలు), ఆర్డీఓ వెంకటేష్, డి డ బ్లు ఓ శిరీష, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ద బోయిన శ్రీనివాస్, సంఘం రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులు పూజారి మాణిక్యం, జిల్లాలోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed