గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలి: చైనా, ఇండోనేషియాల పిలుపు

by samatah |
గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలి: చైనా, ఇండోనేషియాల పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో అత్యంత విషాదకర పరిస్థితులు నెలకొన్నందున వెంటనే ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇండోనేషియా, చైనాలు పిలుపునిచ్చాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సుడీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిలు భేటీ అయ్యారు. అనంతరం రెట్నో మార్సుడీ మీడియాతో మాట్లాడారు. చర్చల ద్వారా పాలస్తీనా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. చైనా, ఇండోనేషియాలు ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి మద్దతు ఇస్తాయని చెప్పారు. ఘర్షణ తీవ్రతరం కాకుండా చైనా సైతం తన ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

చైనా మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘గాజాలో సంఘర్షణ అరునెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇది 21వ శతాబ్దంలోనే అత్యంత విషాదం. అంతర్జాతీయ సమాజం పిలుపునకు ప్రతిస్పందించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గాజాలో కాల్పుల విరమణపై తీర్మానం ముసాయిదాను తయారుచేసింది. కానీ దానిని అమెరికా పదేపదే వీటో అధికారం ద్వారా అడ్డుకుంది. ఇది సరైన పద్దతి కాదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఇజ్రాయెల్ బంధీల విడుదలకు, కాల్పుల విరమణకు ముడిపెట్టలేదని తెలిపారు. హమాస్ దాడులను కూడా యూఎస్ ఖండించలేదని ఆరోపించారు. అలాగే ఇద్దరు మంత్రులు తమ దేశాల ఆర్థిక సంబంధాలు, దక్షిణ చైనా సముద్ర పరిస్థితులపైనా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, చైనా ఇండోనేషియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed