క్రిస్మస్ ను అధికారికంగా జరిపించింది కేసీఆర్ ఒక్కడే.. ఎమ్మెల్యే హరీష్ రావు

by Sumithra |
క్రిస్మస్ ను అధికారికంగా జరిపించింది కేసీఆర్ ఒక్కడే.. ఎమ్మెల్యే హరీష్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి : క్రిస్మస్ ను అధికారికంగా జరిపించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. మెదక్ చర్చిలో జరుగుతున్న వందేళ్ల ఉత్సవాల్లో హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ తొమ్మిదేళ్ళ పాలనలో క్రిస్టియన్ లకు ఎంత చేశాడో, ఎంత బాగా చూసుకున్నారో మీ అందరికీ తెలుసన్నారు. క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ తో పాటు బాక్సింగ్ డే రోజు సైతం సెలవుగా ప్రకటించామని తెలిపారు.

ప్రతి క్రిస్మస్ కు నిరుపేద కుటుంబాలకు గిఫ్ట్ ఇచ్చామని, కేవలం క్రిస్టియన్ లకే కాకుండా అన్ని మతాల వారి పండగలకు గిఫ్ట్ లు ఇచ్చి తెలంగాణను భిన్నత్వంలో ఏకత్వంగా నిలిపి ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఈ చర్చ్ ఇంగ్లాండ్ కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నేట్ 1914 లో నిర్మాణం చేపట్టి 1924 డిసెంబర్ 25 న పూర్తి చేశాడని తెలిపారు. వందేళ్ల ఉత్సవాల్లో వారి మనవడు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కరువు కాలంలో ఆకలి తీర్చేందుకు నిర్మించిన చర్చి ఖండాంతర ఖ్యాతి చెందిందని తెలిపారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, చంద్రా గౌడ్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story