PM Modi: ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీ.. ప్రధాని నరేంద్ర మోడీ

by vinod kumar |
PM Modi: ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల ఉద్యోగాల భర్తీ.. ప్రధాని నరేంద్ర మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలోనే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని తెలిపారు. రోజ్ గార్ మేళా (Rozgar mela) కార్యక్రమంలో భాగంగా సోమవారం 71,000 మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత వేగంగా ఉద్యోగాల కల్పన జరగలేదన్నారు. తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు యువ జనాభా కేంద్రంగా ఉన్నాయని తెలిపారు. నిజాయితీ, పారదర్శకతే నియామక ప్రక్రియను నడిపిస్తున్నాయన్నారు. రిక్రూట్‌మెంట్‌(Recruitment)లో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారని వారు ప్రతి రంగంలోనూ స్వయం ప్రతిపత్తిని సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి కెరీర్‌లో ఎంతో దోహదపడిందని, పీఎం ఆవాస్ యోజన(PM Avasyojana) కింద నిర్మించిన ఇళ్లకు మహిళలే ఎక్కువ మంది యజమానులయ్యారని చెప్పారు. దేశంలో మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. భారతీయ యువకుల సామర్థ్యాలు, ప్రతిభను ఎక్కువగా ఉపయోగించుకోవడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. డిజిటల్ ఇండియా (Digital india), స్పేస్(space), రక్షణ రంగాల్లో సంస్కరణలు వంటి అనేక పథకాలకు యువకులే కేంద్రంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 71,000 మంది రిక్రూట్‌మెంట్‌లో 29 శాతానికి పైగా ఓబీసీలే ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed