ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా దాడి..35 రాకెట్లతో అటాక్

by samatah |
ఇజ్రాయెల్‌పై హిజ్బొల్లా దాడి..35 రాకెట్లతో అటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ మద్దతు గల హిజ్భొల్లా ఇజ్రాయెల్‌పై సోమవారం అర్ధరాత్రి దాడి చేసింది. సుమారు 35రాకెట్లతో విరుచుకుపడింది. లెబనాన్ సరిహద్దు నుంచి ఈ దాడులకు పాల్పడింది. దీనిని ఇజ్రాయెల్ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ నిర్వహించినట్టు తెలిపింది. హిజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్‌లోని సఫేద్ నగరంలో పడిపోయాయని వెల్లడించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం ఏం జరగలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పేర్కొంది. ఈ దాడుల అనంతనం ఇజ్రాయెల్ సైతం లెబనాన్ లోని హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడింది.

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై నిరంతరం దాడులు చేస్తున్నది. దీంతో ఇజ్రాయెల్ సైతం ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 376 మంది హిజ్బొల్లా మిలిటెంట్లు మరణించారు. అలాగే 10 మంది ఇజ్రాయెల్ సైనికులు, పలువురు పౌరులు కూడా మృతి చెందారు. అంతకుముందు ఏప్రిల్ 17న హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై దాడి చేయగా 14 మంది గాయపడ్డారు. కాగా, అమెరికాతోపాటు పలు దేశాలు హిజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు హమాస్ వద్ద బందీలుగా ఉన్న 133 మందిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్‌లో నిరసనలు తెలిపారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాది మంది ఈ నిరసనల్లో భాగమయ్యారు. బంధీల విడుదలకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 34,151 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Next Story