అరిహాను తల్లిదండ్రులకు అప్పగించేందుకు జర్మనీ కోర్టు నిరాకరణ

by Javid Pasha |
అరిహాను తల్లిదండ్రులకు అప్పగించేందుకు జర్మనీ కోర్టు నిరాకరణ
X

బెర్లిన్‌ (జర్మనీ) : భారతీయ చిన్నారి అరిహా షాను తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించేందుకు జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న పాంకోవ్‌ కోర్టు నిరాకరించింది. ఆ పాప గాయాలపై పేరెంట్స్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో.. వారికి చిన్నారిని అప్పగించేందుకు సంబంధించిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. భారతీయ సంక్షేమ సేవా సంస్థకు కూడా చిన్నారిని అప్పగించేది లేదని తేల్చి చెప్పింది. అరిహా షా సంరక్షణ బాధ్యతలను జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయానికి అప్పగించింది. జర్మనీ కోర్టు నిర్ణయం పట్ల పాప తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె బాధ్యతను 140 కోట్ల భారతీయులకు వదిలేస్తున్నట్లు అరిహా తల్లిదండ్రులు తెలిపారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ తమ పాపను వెనక్కి రప్పిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. జర్మనీ తీరు ఆందోళన కలిగిస్తోందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

అరిహా సామాజిక, సాంస్కృతిక, భాషా హక్కులకు భంగం వాటిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, 2021 ఏప్రిల్‌లో 3 నెలల అరిహా షా తలకు గాయమైంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో స్నానం చేయిస్తుండగా ఆ చిన్నారి ప్రైవేట్‌ భాగాలపై మరో గాయమైంది. ఈ రెండు ఘటనలు జర్మనీ అధికారుల దృష్టికి వెళ్లాయి. తమ కుమార్తెకు ప్రమాదవశాత్తు ఆ గాయాలైనట్లు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పాప సంరక్షణ పట్ల పేరెంట్స్‌ నిర్లక్ష్యం వహించడాన్ని జర్మనీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. చిన్నారి అరిహాను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయానికి ఆ పాపను అప్పగించారు. 2021 సెప్టెంబర్‌ నుంచి జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయం కస్టడీలో ఉన్న అరిహా వయసు.. ప్రస్తుతం 27 నెలలు.


Advertisement

Next Story

Most Viewed