కారం చల్లి.. కత్తులతో పొడిచి.. యువకుడి పై దాడి..

by Sumithra |   ( Updated:2025-03-23 04:06:22.0  )
కారం చల్లి.. కత్తులతో పొడిచి.. యువకుడి పై దాడి..
X

దిశ, చౌటకూర్ : భూ తగాదాలతో దళిత యువకుడి పై హత్యాయత్నం చేసిన సంఘటన శనివారం పుల్కల్ మండల పరిధిలోని గొంగ్లూర్ గ్రామ శివారులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మేడికొండ మురళీకృష్ణ (సినీ నిర్మాత), జోగిపేట మార్కెట్ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. వీరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. మురళీకృష్ణ అనుచరులు 15 మంది కలిసి గొంగ్లూర్ శివారులో సంజీవయ్య కొడుకు క్రాంతి కిరణ్ కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. విషయం సంజీవయ్యకు తెలియడంతో తమ్ముడు బాలయ్యను తీసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మురళీకృష్ణ అనుచరులు వీరిపై కూడా కారంపొడి చల్లి దాడికి పాల్పడ్డారు.

అనంతరం క్రాంతి కిరణ్ ను కాళ్లు, చేతులు కట్టేసి వాహనంలో సింగూర్ ప్రాజెక్టు వైపు తరలిస్తూ కత్తులతో పొడిచారు. విషయం పోలీసులకు తెలియడంతో మురళీకృష్ణకు ఫోన్ చేసి కిడ్నాప్ చేసిన యువకుడిని వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో కిడ్నాపర్లు అతడిని వెనక్కి తీసుకువచ్చారు. కిడ్నాప్ చేసిన ఆరుగురిలో ఒకరు పరారు కాగా వాహనంతో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్న కారంపొడి, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు పీఎస్ ముందు బైఠాయించారు. మురళీకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ కేసును పర్యవేక్షిస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు.

Read More: ఎల్బీ నగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు

Next Story