బరువెక్కిన మనసు

by Ravi |   ( Updated:2025-03-26 00:30:35.0  )
బరువెక్కిన మనసు
X

ఒక వసంతకాలం గడిచింది

ఎంతో సంతోషముగా

జంటగా జరుపుకోవాలని

ఎన్నో కలలు కంటూ ఎదురు చూస్తున్న

నా మొదటి పెళ్లి రోజు కోసం

రానే వచ్చింది ఆ పెళ్లి రోజు

కానీ నా కలలు కలలుగానే మిగిలాయి

నా కంట కన్నీరు కాలువలయ్యాయి...

ఎందుకో నా జీవితం అనుకోకుండా

కష్టాల సుడిగుండంలో చిక్కుకుందనీ

నా గుండె బరువెక్కింది

నా బాధకు కారణమైనది

కన్నీటి సాగరంలో కొట్టుకుపోతుంది...

బరువెక్కిన మనసుతో

నా బాధను నీకు చెప్తే

నీ గుండెకు హత్తుకొని

నన్ను ఓదార్చుతూ

ఇకపై నా లోకం

నువ్వెనే అంటావనుకున్న....

నదిలా ప్రవహించే

నా కన్నీళ్లను అప్పుడు

నీ కౌగిలిలో కారుద్దామనుకున్న

కానీ ఎందుకో తెలియదు

అవి బయటకి రాకుండా

నా బాధ చెప్పుకోకుండా

నీ మాటలతో నీ చేతలతో

బిగ్గరగా బిగించినట్టు

ఓ ఆనకట్టను కట్టేశావు

అసలు నాది బాధే కాదన్నావు

అందులో అర్థమేలేదన్నావు

నువ్వు బిగించిన

బిగుసుకు ఊపిరాడక

నన్ను నేను ముగించుకునే

సమయం ముంచుకోస్తుందేమో...

నాకర్థమైంది

నీలో మార్పెన్నటికీ రాదని

అది నేను చూడలేనని

ఇంకా వేచి చూసే ఓర్పు

నాలో నశించిపోతుంది

నీపై నేను పెట్టుకున్న

నమ్మకం రోజురోజుకు

కుంచించుకుపోతుంది

కానీ ఎప్పటికైనా

నన్ను అర్థం చేసుకుంటావని

మనం ఒక్కటవుతామని

ఆశతో ఎదురుచూస్తుంటాను...

- పవిశ్రీ

94908 29401



Next Story