- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్రమ మట్టి తరలింపు పై అధికారుల చర్యలేవి.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..

దిశ, పెద్దపల్లి : జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి దందా పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిర్దావర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గతంలో ఆరుగురు ఇటుక బట్టిల యజమానులు మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరిపారని, విచారణ జరిపిన అధికారులు అధికంగా ఉన్న మట్టిని ఒకచోట కుప్పలు పోయించి సీజ్ చేశారని తెలిపారు.
టెండర్లు వేసి మట్టిని విక్రయించి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అధికారులు గతంలో తవ్వకాలు జరిపిన కంపెనీలకు మళ్ళీ ఎలా మట్టిని ఉచితంగా అప్పజెప్పుతారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేధిక ప్రకారం 70 వేల మెట్రిక్ టన్నులకు గానూ లక్షా 65 వేల 5 వందల పది మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుకున్నారని పేర్కొన్నారు. దీని పై రూ.38లక్షల 56 వేల 3 వందల ఇరవై తొమ్మిది జరిమానా విధించారని వివరించారు. జరిమానా చెల్లించకుండానే ఇటుక బట్టీల యాజమాన్యం మట్టిని తరలించడం పై సురేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
గిర్దావర్ ఆడియో ప్రదర్శన..
అక్రమంగా తరలిస్తున్న మట్టి వాహనాలను వదిలిపెట్టాలని గిర్దావర్ సిబ్బందిని ఆదేశిస్తున్న ఆడియో లీకయ్యింది. ఆడియో సంభాషణను సురేష్ రెడ్డి విలేకరుల ముందు ప్రదర్శించారు. ఎవరి అండ చూసుకొని గిర్దావర్ వాహనాలను వదిలిపెట్టమని ఆదేశిస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. గత ప్రభుత్వంలోని మాజీ ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక, మట్టి దందా చేస్తూ రూ.కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడని, తాను గెలిచిన వెంటనే జైలుకు పంపిస్తా అంటూ తొడగొట్టిన ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రూ.2 కోట్ల స్కాములో ఎమ్మెల్యేకు హస్తం ఉందని ఆరోపించారు.
అక్రమార్కులను వదిలిపెట్టను..
గత మూడేళ్ళుగా ఇసుక, మట్టి తవ్వకాల పై న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో విజయం సాధించానని తెలిపిన ఆయన, అక్రమార్కులను వదిలిపెట్టబోనని సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటుక బట్టీల యజమానులకు వేసిన జరిమానాను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని సురేష్ రెడ్డి కోరారు.