- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కృష్ణా జలాలు సత్వరమే పంచాలి : తెలంగాణ వాదన

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాలు పంచాలని.. వాటాపై సత్వరమే తేల్చాలని కృష్ణా ట్రిబ్యునల్‌ను తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. కృష్ణ జలాల తుది పంపిణీపై ట్రిబ్యునల్-2 (KWDT-II) ముందు మంగళవారం సైతం వాదనలు కొనసాగాయి. జస్టిస్ బ్రిజేశ్ కుమార్ అధ్యక్షతన, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్.తలపత్ర సభ్యులుగా ట్రిబ్యునల్ విచారణను నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్యనాథన్ వాదనలు కొనసాగించారు. తెలంగాణలో ప్రస్తుతం నీటి అవసరాల గురించి వివరించారు. 2018 నాటి కావేరీ తీర్పును ఉదహరించి ‘పరిమిత జల వనరులను జాతీయ దృష్టికోణంలో పరిగణించి, ప్రధానంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటిని రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేయాలి’ అని ట్రిబ్యునల్‌కు వివరించారు. తెలంగాణ ఇన్-బేసిన్ ప్రాజెక్టులకు తగిన వాటా కేటాయించాలని అభ్యర్థించారు.
అలాగే.. ప్రాజెక్టుల అనుమతులపైనా వాదనలు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులను ఎలా కొనసాగించగలదని? ట్రిబ్యునల్ సభ్యులు ప్రశ్నించగా.. ఇవి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ప్రాజెక్టులే అని, 2006లో KWDT-II ముందు వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించామని న్యాయవాది సమాధానమిచ్చారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (PRLIS) నివేదికను తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిందని, కానీ కృష్ణా జలాల విషయమై కేసు ట్రిబ్యునల్‌లో నడుస్తుండటంతో ఆమోదం రావడం లేదని వివరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి సమస్యలను వివరించారు. 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాల్సిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిస్థితిపైనా వివరించారు. కాగా.. ట్రిబ్యునల్ ముందు వాదనలు ఇంకా కొనసాగుతున్నాయని, నేడు మరో విడత వాదనలు జరగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.