Sensational Judgment: అప్సర హత్య కేసు.. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

by Shiva |   ( Updated:2025-03-26 07:44:59.0  )
Sensational Judgment: అప్సర హత్య కేసు.. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని సరూర్‌నగర్‌ (Saroornagar)‌కు చెందిన అప్సర (30) హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ప్రేమ పేరుతో యువతిని వలలో వేసుకున్న పూజారి సాయికృష్ణ (Sai Krishna) (36) పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు అప్సరను అతి కిరాతంగా హతమార్చాడు. ఈ మేరకు కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు (Ranga Reddy District Court) ఇవాళ నిందితుడు సాయికృష్ణ (Sai Krishna)కు జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పును వెలువరించింది. అదేవిధంగా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల పాటు అదనపు జైలు శిక్ష విధించింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

కాగా, తమిళనాడు (Tamilnadu) రాష్ట్రానికి చెందిన చెందిన అప్సర (Apsara) డిగ్రీ పూర్తి చేసి నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పలు తమిళ చిత్రాల్లో నటించింది. అయితే, మూవీల్లో అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్‌లో తల్లితో కలిసి హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చింది. కాశీ (Kasi)లోని తండ్రి ఓ ఆశ్రమంలో పనిచేస్తుండగా.. తల్లి, కూతురు సూరూర్‌నగ‌ర్‌ (Saroornagar)లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఓ రోజు బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లిన అప్సరకు అక్కడ పూజారి, వివాహితుడు సాయికృష్ణ (Sai Krishna)తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే తనను వివాహం చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర (Apsara) ఒత్తిడి తీసుకొచ్చింది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ను బయటపెడతానంటూ బెదిరించింది. అయితే, విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందనే భయపడిన సాయికృష్ణ, అప్సరను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. 2023 జూన్ నెలలో కోయంబత్తూరు (Coimbatore) వెళ్తున్నామని తన కారులో అప్సరను తీసుకెళ్లిన సాయికృష్ణ హైదరాబాద్ శివారు ప్రాంతంలోకి వెళ్లగానే.. అక్కడే హతమార్చి మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న డ్రైనేజీలో పూడ్చిపెట్టాడు.

Next Story