- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2025 : ముంబై మళ్లీ బోల్తా.. బోణీ కొట్టిన గుజరాత్

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌ను ఓటమితోనే ప్రారంభించాయి. తమ తొలి మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్‌ది పైచేయి. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్‌లో గుజరాత్ బోణీ కొట్టగా.. ముంబై వరుసగా రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 స్కోరు చేసింది. సాయి సుదర్శన్(63) మరోసారి హాఫ్ సెంచరీ మెరవడంతో గుజరాత్‌కు భారీ స్కోరు దక్కింది. కెప్టెన్ గిల్(38), బట్లర్(39) విలువైన రన్స్ జోడించారు. అనంతరం ఛేదనలో ముంబై 160/6 స్కోరుకే పరిమితమైంది. సూర్యకుమార్(48), తిలక్(39) రాణించగా.. రోహిత్(8), రికెల్టన్(6), పాండ్యా(11), రాబిన్ మింజ్(3) విఫలమవడం ముంబై ఓటమిని శాసించింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటి జట్టుకు భారీ విజయాన్ని అందించారు.
ముంబై బ్యాటర్లు అంతంతే
ముంబై బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. రోహిత్ శర్మ(8) తొలి ఓవర్‌లోనే వికెట్ పారేసుకోవడంతో ముంబైకి ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. రికెల్టన్(6) కూడా నిరాశపరిచాడు. వీరిద్దరిని సిరాజే అవుట్ చేశాడు. పేలవ ఆరంభం దక్కిన జట్టును సూర్యకుమార్, తిలక్ వర్మ ఆదుకునేందుకు చూశారు. సూర్య సిక్సర్లతో దూకుడుగా కనిపించగా.. తిలక్ ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ముంబై 97/2తో ఒక దశలో గాడినపడేలా కనిపించింది. అయితే, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కోలుకోని దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో వీరిద్దరూ పెవిలియన్ పంపి ముంబై గెలుపు ఆశలపై నీళ్లుచల్లాడు. రాబిన్(3), కెప్టెన్ పాండ్యా(11) కూడా క్రీజులో నిలువకపోవడంతో ముంబై ఓటమి ఖరారైంది. నమన్ ధిర్(18 నాటౌట్), సాంట్నర్(18 నాటౌట్) చివరి వరకూ అజేయంగా ఉండటం తప్ప అద్భుతమమీ చేయలేదు.
సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్
అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన అతను ఈ మ్యాచ్‌లోనూ అర్ధ శతకంతో మెరిశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63 రన్స్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చి 18వ ఓవర్‌కు క్రీజులో ఉండి గుజరాత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సుదర్శన్ తర్వాత గిల్, బట్లర్ ఆకట్టుకున్నారు. వీరిద్దరితో కలిసి సుదర్శన్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముందుగా గిల్, సుదర్శన్ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించారు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో తొలి ఆరు ఓవర్లలో 66 రన్స్ లభించాయి. గిల్ అవుటైన తర్వాత బట్లర్ అతనికి తోడయ్యాడు. ఓ ఎండ్‌లో సుదర్శన్ దూకుడు కొనసాగించగా.. మరో ఎండ్‌లో బట్లర్‌తో ఫోర్లతో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో గుజరాత్ 129/1 స్కోరుతో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, ముంబై బౌలర్లు పుంజుకోవడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రూథర్‌ఫొర్డ్(18) స్వల్ప స్కోరే చేయగా.. షారుఖ్ ఖాన్(9), తెవాటియా(0), రషీద్ ఖాన్(6) నిరాశపరిచారు. దీంతో గుజరాత్ 200లోపే ఆలౌటైంది.
గిల్@1,000
ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ నరేంద్ర మోడీ స్టేడియంలో 1,000 పరుగులు పూర్తి చేశాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో అతను ఈ ఫీట్ సాధించాడు. ఒకే వేదికపై 1,000 రన్స్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఫాస్టెస్ట్ బ్యాటర్ రికార్డు విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికపై 19 ఇన్నింగ్స్‌ల్లో 1,000 రన్స్ చేశాడు.