- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బెల్టు జోరు.. దోపిడీపైనే సిండికేట్ మాఫియా దృష్టి..

ఏజెన్సీ నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మద్యం బెల్టు దుకాణాలు అడ్డూ అదుపు లేకుండా వెలుస్తున్నాయి. గ్రామాల్లో కిరాణా షాపులకు ధీటుగా ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. సులభతరంగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో కొంతమంది బెల్టు దుకాణాలను ఉపాధిగా ఎంచుకుంటుండగా, రోజు వారీగా ఆదాయం వస్తుండటంతో కిరాణా దుకాణ యజమానులు సైతం మద్యం విక్రయాలు చేస్తున్నారు. మండలంలో మొత్తం 8 మద్యం దుకాణాలు ఉండగా వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడిన గ్రామాల్లో బెల్టుషాపులను ప్రోత్సహిస్తూ.. ఒక వాహనం ద్వారా రోజూ వారీగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేయాలంటే ముందుగానే డిపాజిట్‌ను వసూలు చేస్తున్నారు. షాపు స్థాయిని బట్టి రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ రూపంలో పోగేసుకుంటున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్లను బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. అక్కడ క్వార్టర్ బాటిల్ పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80లకు పైగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
దిశ, అశ్వారావుపేట టౌన్ : అశ్వారావుపేట మద్యం మాఫియా మందుబాబులను దోచుకోవటానికి బెల్టు బిజినెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అధికారిక దుకాణాల్లో అదనంగా రూ.80 లకు పైగా వసూలు చేస్తున్న సిండికేట్ మాఫియా.. బెల్టు దుకాణాలతో మరో రూ.30 దోపిడీని ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో కిరాణా షాపులకు ధీటుగా బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా దోచుకుంటోంది. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసేందుకు డిపాజిట్లు వసూలు చేస్తోంది. ఇందుకోసం ఒక వాహనం ద్వారా రోజూ వారీగా మద్యం సరఫరా చేస్తోంది.
ఏజెన్సీ నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మద్యం బెల్టు దుకాణాలు అడ్డు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. వ్యాపారం విస్తరించేలా సిండికేట్‌గా ఏర్పడిన మద్యం వ్యాపారులు అక్రమ దందాకు గ్రామాల పై దృష్టి సారించారు. ఇంకేముంది గ్రామాల్లో బెల్టు దుకాణాలకు తెరలేపారు. ప్రభుత్వం అధికారికంగా మండలంలో 8 మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ ప్రతి గ్రామంలోనూ పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలకు సిండికేట్ అనధికారికంగా అనుమతులిచ్చింది. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేయాలంటే ముందుగా డిపాజిట్‌ను వసూలు చేస్తుంది. షాపు స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ రూపంలో పోగేసుకుంటుంది. ఈ మొత్తాన్ని అధికారిక వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకుంటుంది.
బానిసవుతున్న యువత..
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలను ఏర్పాటు చేయటంతో మంచినీటి కంటే అతి సులువుగా మద్యం దొరుకుతుండటంతో గ్రామీణ యువత మద్యానికి బానిసవుతోంది. ఎటు చూసినా బెల్టు దుకాణాలు దర్శనమివ్వటంతో వారి కన్ను అటుగా మళ్లుతోంది. బెల్టు నిర్వహకులు సైతం పోటీపడి మరీ అమ్మకాలు సాగిస్తుండటంతో దీని ప్రభావం ఎక్కువగా యువతపై పడుతోంది. గ్రామాల్లో గొడవలకు బెల్టు దుకాణాలు కారణమవుతున్నాయనే వాదన ఉంది.
ఎక్కువ మందికి ఉపాధి..
సులభతరంగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది బెల్టు దుకాణాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. స్థానిక నాయకులను మచ్చిక చేసుకుని దుకాణాలను తెరిచేస్తున్నారు. రోజు వారీగా ఆదాయం కంటికి కనిపించటంతో ఇతర పనులు మానుకుని ఇదే ప్రధాన వృత్తిగా మార్చుకుంటున్నారు. బెల్టు వ్యాపారం గమనించిన కిరాణా దుకాణ యజమానుల కన్ను మద్యం విక్రయాల పై పడుతోంది. కిరాణా సరుకుల విక్రయం మాటుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బెల్టు దుకాణాలను ఏకంగా వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. ఈ గ్రామాల్లో మరెవరూ మద్యం విక్రయాలు, దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే షరతు ఉంటుంది. ఇక్కడ బెల్టు మద్యం ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి.
రూ.20 కోట్లకు పైనే దోపిడీ..
బెల్టు దుకాణాలతో మద్యం ప్రియులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. సిండికేట్ దోపిడీతో ఏటా సుమారు రూ.20 కోట్లకు పైగానే నష్టపోతున్నారు. ఈ సొమ్ముంతా అధికారులు, ఇతరులకు అమ్యామ్యాలు పోను మిగతాని సిండికేట్ జేబులు నింపుకుంటుంది. మండలంలో మొత్తం 8 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని కొందరు వ్యాపారులు సిండికేట్గా ఏర్పాటు చేసుకుని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్లను వ్యాపారులు దుకాణాల్లో విక్రయించకుండా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెల్టు దుకాణాలకు తరలించడంతో క్వార్టర్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80లకు పైగా వసూలు చేస్తున్నారు. దుకాణాల్లో విక్రయించాల్సి వస్తే ఎమ్మార్పీకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను బెల్టు దుకాణాలను తరలిస్తూ పరోక్ష దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక దుకాణాల్లో డిమాండ్ లేని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. సిండికేట్‌తో పాటు బెల్టు నిర్వాహకులు సుమారు 40శాతం అదనంగా మందుబాబులను దోచుకుంటున్నారు. సిండికేట్, బెల్టు నిర్వహకులు అదనంగా వసూలు చేస్తున్న అక్రమార్జన రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని మందుబాబుల అంచనా.
బెల్టు వ్యాపారం మా దృష్టికి రాలేదు.. సాంబమూర్తి, ఎక్సైజ్ సీఐ, అశ్వారావుపేట..
గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు, మద్యం అనధికారిక విక్రయాలు మా దృష్టికి రాలేదు. దాడులు చేసి తగు చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వ అనుమతి ఉన్న మద్యం దుకాణాల్లో అధిక ధరల విక్రయాలపైనా నిఘా ఉంచుతాం. బెల్టు దుకాణాల నిర్వహణ, అదనపు వసూళ్లను సహించేది లేదు.