ప్రారంభం గణం.. వైద్య సేవలు శూన్యం..

by Sumithra |
ప్రారంభం గణం.. వైద్య సేవలు శూన్యం..
X

దిశ, అలంపూర్ : గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.21 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి నేటికీ వినియోగంలోకి రాలేదు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు అక్టోబరు మాసంలో అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం హడావుడిగా ఆస్పత్రిని ప్రారంభించారు. దాంతో మెరుగైన వైద్యం అందుతుందని అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఆశపడ్డారు. కానీ వైద్య సేవలను మాత్రం నేటికీ ప్రారంభం కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అలంపూర్ ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఏపీలోని కర్నూలు ఆస్పత్రికి వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇక్కడి నుంచి వెళ్లిన రోగులను అక్కడి ప్రభుత్వ వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దాంతో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని సంబరపడ్డారు. జాతీయ రహదారి పై ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అంది ప్రాణాలు నిలుస్తాయని భావించారు. కానీ ఆస్పత్రి అందుబాటులోకి రాకపోవడంతో ఎంతోమంది క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. హై రిస్క్ కాన్పుల కోసం కర్నూలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు.

చోరీకి గువుతున్న సామగ్రి...

ఆస్పత్రి ప్రారంభం అయ్యాక అవసరమైన సామగ్రి కొన్ని వారాల్లోనే వచ్చింది. 100 పడకల్లో సామగ్రి, ఆక్సిజన్ పరికరాలు, సెలైన్ బాటిల్ స్టాండ్స్, టేబుళ్లు, ఈజీసీ, సీటీజీ, అల్ట్రాసౌండ్ పరికరాలు, ఎక్స్రే, ఆపరేషన్ థియేటర్ కు అవసరమైన సామగ్రి వచ్చాయి. కానీ నెలలు గడిచిపోతున్నా సిబ్బందిని నియమించకపోవడంతో వినియోగంలోకి రావడం లేదు. ఆస్పత్రి పరిసరాల్లో జనవాసాలు లేకపోవడంతో దొంగలు కిటికీల గ్రిల్స్ తొలగించి, రూ.10 లక్షల విలువైన సామగ్రిని దొంగిలించారని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా చేసే రాగి వైపులు, నీటి కొళాయిలు, టాయిలెట్ సామగ్రి, విద్యుత్ వైర్లు, లైట్స్ తదితరాలు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ సయ్యద్భాషా ఉండవల్లి పోలీసులకు ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. నాటి నుంచి జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రి వద్ద నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిని వినియోగంలోకి తేవాలంటే డాక్టర్లు, గైనకాలజిస్టులు ఐదుగురు, ఫిజీ షియన్లు ఇద్దరు, చిన్నపిల్లల డాక్టర్లు ఐదుగురు, ఎంబీబీఎస్ వైద్యులు ఆరుగురు, పీడియాట్రిక్ డాక్టర్లు అవసరం. అదే విధంగా శానిటేషన్ సిబ్బంది 30 మంది, సిస్టర్లు 15 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే సిబ్బంది, ఎంఎన్వీస్, ఎఫ్ఎన్వో లు ముగ్గురేసి చొప్పున కావాలి.

నెరవేరని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ..

ఏడు నెలల క్రితం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. త్వరలో సిబ్బందిని కేటాయించి, వినియోగంలోకి తెస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఎలాంటి పురోగతి లేదు. అసెంబ్లీ సమావేశంలోనైనా స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వంద పడకల ఆసుపత్రి గురించి మాట్లాడతారని అందరూ భావించారు. కానీ ఆ ప్రస్తావన తీయకపోవడం పై అలంపూర్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రం ఆరోగ్యశ్రీ సేవలు మాటేమో కాని ఇక్కడున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి వైద్యసేవలు అందకపోవడం గురించి ఎందుకు మాట్లాడడం లేదని వాపోతున్నారు. పాలకులు అలంపూర్ ప్రజలను కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారని, రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది వైద్య అందక ప్రాణాలు పోతున్నా కనిపించడం లేదా అని అలంపూర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైన స్పందించి వెంటనే వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను ఏర్పాటు చేసి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed