హైడ్రా-జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ల భేటీ.. ఆ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం

by Shiva |
హైడ్రా-జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ల భేటీ.. ఆ స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలను తొలగించే విధంగా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్‌సేఫ్టీ, మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్, నాలా పూడికతీత, నాలా భద్రతా, చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి కమిషనర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు. నగరంలో ఇప్పటికే గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలకు ఆస్కారం లేకుండా పూడికతీత పనులు పూర్తి చేయాలని తెలిపారు. అందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నగరపౌరుల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

చెరువుల సంరక్షణ, పునరుద్ధరణ..

నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. అంతే కాకుండా వర్షాల సందర్భంగా చెరువుల ద్వారా ఓవర్‌ఫ్లో కాకుండా ముందస్తు నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. తద్వార లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు కృషి చేసిన వారవుతారని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, నాలాలో ప్రమాదాలు సంభవించకుండా నాలా ఆడిట్‌ చర్యలు తీసుకోవాలని, అందుకోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు సర్కిల్‌కు ఒక ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని కమిషనర్ సూచించారు. భారీ వర్షాల సందర్భంగా వాతావరణ శాఖ సూచనలను వార్డు వారీగా తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తం చేయాలని, చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డుపై ప్రవహించే నీటిలో వెళ్లకుండా చూడాలని, స్టార్మ్ వాటర్, మ్యాన్ హోల్స్ తెరవకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పనులు జరిగినప్పుడు హెచ్చరిక బోర్డులు, విద్యుత్ దీపాలు పెట్టి ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు.

అగ్ని ప్రమాదాల నివారణకు..

వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నగరంలో ఉన్న వాణిజ్య, నివాస భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన సురక్షిత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలన్నారు. అందులో భాగంగా భవన యజమానులు, నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. మంటలు వేగంగా వ్యాపించే వస్తువుల స్టోరేజ్ గోదాంలలో, పురాతన భవనాలలో ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఫైర్ సేఫ్టీ నిర్వహణ సజావుగా ఉండేలా, ప్రమాద నివారణ చర్యలు తీసుకునేలా సంబంధిత యజమానులను చైతన్యపరచాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ఫైర్‌సేఫ్టీ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో అవసరమైన నివారణా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నివాసిత అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలలో భ‌వ‌న లేఅవుట్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ ప్లాన్‌, ఫైర్ ఎన్ఓసీ త‌దిత‌ర అంశాల‌ను విస్తృత స్థాయిలో త‌నిఖీ చేసి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో గత రెండేళ్లలో ఏఏ ఏరియాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కమిటీలతో పరిష్కారం సులువు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

అగ్ని ప్రమాదాల నివార‌ణ‌కు ఫైర్ డిపార్టుమెంట్‌తో పాటు హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాల‌తో క‌లిసి ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వ‌ర్షాకాలంలో వ‌ర‌ద ముప్పు నివార‌ణ‌తో పాటు ట్రాఫిక్ స‌మ‌స్యలు త‌లెత్తకుండా చూడ‌డానికి ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారుల‌తో ప్రాంతాల‌ వారీగా క‌మిటీలు వేయాల‌న్నారు. ఈ రెండు క‌మిటీలు ఎప్పటిక‌ప్పుడు స‌మావేశ‌మై స‌మ‌న్వయంతో స‌మ‌స్యలు ఉత్పన్నం కాకుండా చూడాల‌ని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ్ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, వెంకన్న, రవికిరణ్, సీఈలు భాస్కర్ రెడ్డి, రత్నాకర్, కోటేశ్వరరావు, సీసీపీ శ్రీనివాస్, విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, హైడ్రా అధికారులు, ఫైర్‌సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed