Elon Musk: మస్క్ వర్క్ పర్మిట్ గురించి బయటకొస్తున్న సంచలనాలు

by Shamantha N |
Elon Musk: మస్క్ వర్క్ పర్మిట్ గురించి బయటకొస్తున్న సంచలనాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అక్రమ వలసల గురించి రిపబ్లిక్, డెమొక్రటిక్ పార్టీల అభ్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు తెలుపుతున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి సంచలనాలు బయటకొచ్చాయి. మస్క్‌ కొంతకాలం యూఎస్ లో వర్క్‌ పర్మిట్‌ లేకుండా పని చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాషింగ్టన్‌ పోస్ట్ లో ఓ స్టోరీ వెలువడింది. సౌతాఫ్రికాకు చెందిన ఎలాన్‌ మస్క్‌ 1995లో కాలిఫోర్నియాలోని పాలోఆల్టోకి వచ్చారు. అయితే ఆయన ఏ యూనివర్సిటీలో నమోదు చేసుకోకుండానే జిప్‌ 2 అనే సాఫ్టవేర్‌ కంపెనీని డెవలప్ చేశారు. 1999లో ఆ కంపెనీని సుమారు 300 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ పొందాలంటే ఆ వ్యక్తి గ్రాడ్యూయేషన్‌ కోర్సులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకుండానే కొంత కాలం ఉన్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది.

మస్క్ ఏమన్నారంటే?

ఇకపోతే, 1997లో మస్క్‌ వర్క్‌ పర్మిట్‌ పొందినట్లు ఆయన సహచరులు తెలిపనట్లు వాషింగ్టన్ పోస్టు స్టోరీలో పేర్కొంది. అంతేకాకుండా, 2020లో మస్క్‌ ఈ వివాదంపై ఓ పోడ్‌కాస్ట్‌లో స్పందించినట్లు పేర్కొంది. తాను చట్టబద్ధంగానే అమెరికాలో ఉన్నట్లు ఆ పోడ్ కాస్ట్ లో మస్క్ పేర్కొన్నారు. కాగా.. వాషింగ్టన్ పోస్టు కథనంపై మస్క్ ఇప్పటివరకు స్పందించలేదు. నవంబరు 5న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్‌ మద్దతు పలికారు. కాగా.. అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో మస్క్ గురించి స్టోరీలు రావడం విశేషం.

Advertisement

Next Story