ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 10:26:09.0  )
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి సంచలనం రేపింది. డ్రోన్ డాడి సమయంలో ప్రధాని నెతన్యాహు దంపతులు ఇంట్లో లేకపోవడంతో ముప్పు తప్పింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా గ్రూపు ఉగ్రవాదులు ప్రయోగించిన మూడు డ్రోన్లు ఇజ్రాయెల్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చాయి. ఒక డ్రోన్ ప్రధాని నెతన్యాహు ఇంటికి సంబంధించిన ఒక భవనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మరో రెండు డ్రోన్లలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకున్నాయి. డ్రోన్ దాడి ఘటనపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నివాసంపై యూఏవీని ప్రయోగించారని, ఆ సమయంలో ప్రధాని, ఆయన భార్య అక్కడ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అంతకుముందు ఇజ్రాయెల్ మిలటరీ దీనిపై మాట్లాడుతూ, లెబనాన్ నుంచి మూడు డ్రోన్లు దూసుకువచ్చాయని తెలిపింది. రెండు డ్రోన్‌లను మధ్యలోనే అడ్డుకోగా, ఒక డ్రోన్ సిజేరియాలోని భవనాన్ని ఢీకొన్నట్టు చెప్పింది. కాగా, డ్రోన్ దాడులకు తామే కారణమని హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. హమాస్ చీఫ్ సిన్వర్‌ను మట్టుబెట్టడాన్ని కీలక విజయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ శుక్రవారం రాత్రి సైతం గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనా వాసులు మరణించడంతో ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42 వేలకు చేరిందని గాజా అధికారులు ప్రకటించారు. ఆయుధాలు విడిచి, బందీలను విడిచిపెట్టేంత వరకూ యుద్ధం ఆపేది లేదని నెతన్యాహూ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed