ఆమె అలా వ‌చ్చింద‌ని వ‌ద్ద‌న్నారు.., మొత్తానికే మూసేశారు!!

by Sumithra |
ఆమె అలా వ‌చ్చింద‌ని వ‌ద్ద‌న్నారు.., మొత్తానికే మూసేశారు!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః బురఖా ధరించిన మహిళకు ప్రవేశం నిరాకరించిందన్న ఆరోపణలపై బహ్రెయిన్‌లోని అధికారులు లాంత‌ర్న్స్ అనే ఓ భారతీయ రెస్టారెంట్‌ను మూసేశారు. బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బిటీ) ఈ సంఘ‌ట‌న‌పైన‌ విచారణ ప్రారంభించింది. వివ‌రాల్లోకి వెళితే, బహ్రెయిన్ రాజధాని మనామాలోని అద్లియా ప్రాంతంలో ఉన్న లాంతర్న్స్‌ రెస్టారెంట్‌కు ఓ ముస్లిం మ‌హిళ వీల్ ధ‌రించి, వెళ్లింది. త‌ల‌కున్న వీల్‌ను తీయ‌కుండా రెస్టారెంట్‌లోకి అనుమ‌తించ‌మ‌ని, లాంత‌ర్న్స్ రెస్టారెంట్ మేనేజ‌ర్ ఆమెను లోప‌ల‌కి అనుమ‌తించ‌లేదు. స‌మాచారం అందుకున్న బిటీ అధికారులు దీనిపై తీవ్రంగా స్పందించారు. 'దేశ చట్టాలను ఉల్లంఘించే విధానాలను రెస్టారెంట్లు అమలు చేయకుండా ఉండాలి' అని విజ్ఞ‌ప్తి చేశారు. "ప్రజల పట్ల వివక్ష చూపే ఎలాంటి చర్యలనైనా మేము తిరస్కరిస్తాము. ముఖ్యంగా వారి జాతీయ గుర్తింపుకు సంబంధించి వివ‌క్ష చూపిస్తే స‌హించ‌ము" అని ఈ సంద‌ర్భంగా బిటీ పేర్కొంది. ట్రావెల్ ఆర్గ‌నైజేష‌న్స్‌కు సంబంధించిన‌ 1986 డిక్రీ లా నంబర్ 15 ప్రకారం రెస్టారెంట్‌ను మూసివేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

ఈ సంఘ‌ట‌న త‌ర్వాత లాంతర్న్స్ రెస్టారెంట్‌ యాజ‌మాని స‌ద‌రు మేనేజర్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒక‌టి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టింది. "అందమైన బహ్రెయిన్ దేశంలో మేము 35 సంవత్సరాలకు పైగా అంద‌రు జాతీయులకు సేవలు అందిస్తున్నాము. లాంత‌ర్న్స్‌లో ఎవ‌రికైనా అనుమ‌తి ఉంటుంది" అని ఈ పోస్టులో పేర్కొన్నారు. అలాగే, "సద్భావనకు సూచనగా" బహ్రెయిన్ పౌరులను మార్చి 29న రెస్టారెంట్‌లో కాంప్లిమెంటరీ ట్రీట్‌కు ర‌మ్మ‌ని ఆహ్వానం కూడా ప‌లికింది.

Advertisement

Next Story

Most Viewed