Balochistan : పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 73 మంది మృతి

by Hajipasha |
Balochistan : పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 73 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, హైవేలు లక్ష్యంగా సోమవారం ఉగ్రమూకలు దాడులకు తెగబడ్డారు. రైళ్లు, బస్సులు, ట్రక్కులను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో మొత్తం 73 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 14 మంది పాకిస్తాన్ భద్రతా దళ సిబ్బంది కూడా ఉన్నారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. వీరంతా ఉగ్రవాదులను ప్రతిఘటించే క్రమంలో ప్రాణాలు విడిచారని తెలిపాయి. తమ బలగాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌‌లో 21 మంది ఉగ్రవాదులు మట్టికరిచారని పాక్ ఆర్మీ వెల్లడించింది. ‘‘ఉగ్రవాదులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. రోడ్ల మీదుగా వెళ్తున్న వాహనాలను ఆపి, వాటిలోని ప్రయాణికుల ఐడీ కార్డులను చెక్ చేశారు. ఆ వెంటనే వాళ్లను తుపాకీతో కాల్చి చంపారు. ఇలా వాహనాల్లోని ప్రయాణికులందరినీ చంపాక, వాటికి నిప్పుపెట్టారు’’ అని అధికార వర్గాలు మీడియాకు వివరించాయి. ఈవిధంగా మూసా ఖైల్ అనే ఏరియాలోని ఒక్క హైవేపైనే దాదాపు 35 వాహనాలకు ఉగ్రవాదులు నిప్పుపెట్టినట్లు తెలిసింది.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కార్మికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడులు చేశారని సమాచారం. అక్కడి కార్మికుల వల్ల స్థానికులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే ఈ ఉగ్రదాడులు జరిగాయని పాక్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ దాడులలో చనిపోయిన కార్మికులంతా పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన వారేనని అంటున్నారు. దాడులకు బాధ్యత వహిస్తూ వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటన చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఈ దాడులను ఖండించారు. ఇదొక అనాగరిక చర్య అని అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆర్డర్స్ జారీ చేశారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని, ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ దాడులన్నీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ తెలిపారు.

Advertisement

Next Story