MLA : మీ కోసం నిలబడతా.. ప్రభుత్వంతోనైనా కలబడతా

by Kalyani |
MLA : మీ కోసం నిలబడతా.. ప్రభుత్వంతోనైనా కలబడతా
X

దిశ, జడ్చర్ల : తాను ఎప్పుడూ ప్రజలకు అండగా నిలడతానని, అధికార పక్షానికి చెందిన శాసనసభ్యుడినైనా అవసరమైతే ప్రజల కోసం ప్రభుత్వంపై తిరగడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం జడ్చర్ల మండలంలోని దేవుని గుట్ట తండా సమీపంలో ఉదండాపూర్ భూ నిర్వాసిత రైతులతో గ్రామస్తులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ఉదండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం పెంచకపోతే ఒప్పుకొనే ప్రసక్తే లేదని, తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నే అయినా సరే ఈ విషయంలో అవసరమైతే ప్రభుత్వంపై తిరగబడటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు కట్టే కాంట్రాక్టర్లకు నష్టమొస్తుందంటే వందల కోట్ల రుపాయలను పెంచే ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహారాన్ని మాత్రం ఎందుకు పెంచదని ప్రశ్నించారు.

ఉదండాపూర్ భూ నిర్వాసితుల సమస్య, వారికి పునరావాస సహాయం పెంచాలనే విషయంలో తాను ఎమ్మెల్యే కాకముందు నుంచి పోరాడుతున్నానని, ఎమ్మెల్యే అయ్యాక అసెంబ్లీలో కూడా మొదట ఈ సమస్య గురించే మాట్లాడానని గుర్తు చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 2016 లో ఎకరానికి రూ.6.50 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని, ఇప్పుడు కూడా అదే మొత్తాన్ని రైతులకు పరిహారంగా ఇస్తామనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అప్పుడు ఈ ప్రాంతంలో భూముల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పాలమూరు ప్రాజెక్టుకు గుండె వంటిదని ఇది పూర్తయి కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు అందిస్తేనే 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని వివరించారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఉదండాపూర్ భూ నిర్వాసితుల పునరావాసం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.

పాలమూరు ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది ఉదండాపూర్, వల్లూరు గ్రామస్తులేనను చెప్పారు. ఇప్పటికే ఈ విషయం గురించి నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్లానని భూ నిర్వాసితులు ఇచ్చే పరిహారాన్ని పెంచే విషయం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు సామర్థ్యాన్ని ఒక టీఎంసీ పెంచి, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.30 వేల కోట్లు పెంచుకుందని, ఆ సమయంలోనే ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యను పట్టించుకొని ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారమైయ్యేదని అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఉదండాపూర్, వల్లూరుతో పాటు మిగిలిన 7 తాండాలకు చెందిన గ్రామస్తుల పక్షాన నిలబడి పోరాడుతానన్నారు. ఆ గ్రామాల్లో తిరిగి మళ్లీ రీ సర్వే చేయించి జరిగిన తప్పులను సరిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ ముకుందరెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు , ఇరిగేషన ఎస్ ఈ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, తదితర అధికారులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

Next Story

Most Viewed