Amritpal : ఎంపీ అమృత్‌పాల్ బంధువుల నివాసాలపై ఎన్ఐఏ రైడ్స్

by Hajipasha |
Amritpal : ఎంపీ అమృత్‌పాల్ బంధువుల నివాసాలపై ఎన్ఐఏ రైడ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా కేంద్రంగా వేళ్లూనుకుంటున్న ఖలిస్తాన్ వేర్పాటువాదం మూలాలను వెలికితీసి ధ్వంసం చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే 2023 మార్చిలో కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత హైకమిషన్‌ కార్యాలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు జరిపిన దాడితో సంబంధమున్న వారిని గుర్తించే పనిలో పడింది. శుక్రవారం రోజు పంజాబ్‌లోని మోగా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, జలంధర్‌‌లలో జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ), పంజాబ్ పోలీసులు సంయుక్త సోదాలు నిర్వహించారు. వాస్తవానికి ఈ వ్యవహారంపై గతేడాది జూన్‌లో ఎన్‌ఐఏ కేసును నమోదు చేసింది. పంజాబ్‌లోని ఖండూర్ సాహిబ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ అమృత్‌పాల్ సింగ్ బావ అమర్‌జోత్ సింగ్‌ను నిందితుడిగా పేర్కొంది.

అమృత్‌సర్ జిల్లాలోని అమర్‌జోత్ సింగ్‌, అతడి బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఇదే జిల్లాలోని జల్లూపూర్ ఖేరా గ్రామంలో అమృత్‌పాల్ సింగ్ జన్మించాడు. ఈ ఊరి సమీపంలోని రయ్య ఏరియాలో అమృత్‌పాల్ మేనమామ పర్గత్ సింగ్ సంధుకు ఒక ఫర్నీచర్ షాపు ఉంది. ఆ షాపుతో పాటు పర్గత్ సింగ్ ఇంటిని కూడా ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు. ఈ రైడ్స్ జరిగినప్పుడు అమృత్‌పాల్ సన్నిహితుడు చరణ్‌దీప్ సింగ్ భిందేర్ ఇంట్లో లేకపోవడం గమనార్హం. బుతాలా గ్రామంలోని అమృత్‌పాల్ సోదరి, ఇతర బంధువుల ఇళ్లలో రైడ్స్ చేశారు. పర్గత్ సింగ్ సంధు భార్య అమర్జిత్ కౌర్‌‌తో పాటు అమృత్‌పాల్‌కు చెందిన పలువురు బంధువులను బియాస్ పోలీసు స్టేషనుకు తీసుకెళ్లి ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed