విరాట్ లోటు తీర్చేదెవరు?

by Anukaran |   ( Updated:2020-11-23 07:59:14.0  )
విరాట్ లోటు తీర్చేదెవరు?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాను స్వదేశంలో ఓడించాలంటే చాలా కష్టం. వాస్తవానికి ఏ జట్టునైనా తమ స్వదేశంలో ఓడించడం చాలా కష్టమైన సవాలే. నిన్న మొన్నటి వరకు టీమ్ ఇండియా అంటే స్వదేశీ పులులు అనే ముద్ర పడింది. సౌరవ్ గంగూలీ, అజారుద్దీన్ వంటి వాళ్లు విదేశీయులపై కాస్తో కూస్తో విజయాలు సాధించారు. కానీ, సిరీస్ విజయాలు సాధించడం గత ఐదేళ్లుగా మాత్రమే సాధ్యమవుతున్నది. ధోని, కోహ్లీ కెప్టెన్సీల్లో టీమ్ ఇండియా చెప్పుకోదగిన విజయాలే సాధించింది.

ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లి ఆధిపత్యం చెలాయించే ఆసీస్.. తమ సొంత గడ్డపై మరింతగా రెచ్చిపోతుంది. ఇంగ్లాండ్ వంటి జట్టుకే ఆసీస్ చుక్కలు చూపెట్టింది. ఇక భారత జట్టు అయితే 2018-19 సీజన్ వరకు అక్కడ టెస్టు సిరీస్ నెగ్గలేదు. 72 ఏళ్ల తర్వాత కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా.. కంగారూలను కంగారు పెట్టింది. ఏకంగా 2-1తో సిరీస్ గెలిచింది. చతేశ్వర్ పుజారా అద్భుతంగా రాణించడంతో పాటు అతడికి కోహ్లీ, పంత్ సహకరించారు.

కోహ్లీ స్థానం భర్తీ చేసేదెవరు?

ప్రస్తుత టీమ్ ఇండియాలో విదేశీ గడ్డపై టెస్టుల ఆడిన అనుభవం కోహ్లీతో పాటు పుజార, రహానే, పంత్, రోహిత్ శర్మకు ఉంది. స్వదేశంలో అయినా విదేశంలో అయినా పుజారాతో పాటు కోహ్లీ నమ్మదగిన టెస్టు బ్యాట్స్‌మెన్. టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతికొద్ది సమయంలోనే కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టాడు. టీమ్ ఇండియా 2014లో ఆసీస్ పర్యటనలో ఉన్న సమయంలోనే ధోని అకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తొలి టెస్టులో కోహ్లీ రెండు సెంచరీలు చేశాడు. మూడు, నాలుగో టెస్టులో కూడా కోహ్లీ సెంచరీలతో సునామీ సృష్టించాడు. అప్పుడు అతడికి తోడుగా మురళి విజయ్ కూడా బ్యాటుతో రాణించాడు.

ఆస్ట్రేలియా గడ్డపై అనుభవం ఉన్న మురళి విజయం ప్రస్తుతం జట్టుతో లేడు. తొలి టెస్టు తర్వాత కోహ్లీ ఇండియాకు తిరిగి రానున్నాడు. దీంతో నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్ చేసేది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి రికార్డే ఉన్నది. కానీ, టెస్టుల్లో అతడు నిలకడైన బ్యాట్స్‌మెన్ కాదు. కోహ్లీ గైర్హాజరీలో అజింక్య రహానేపై కెప్టెన్సీ భారం పడనుంది. దీంతో అతడు బ్యాటింగ్‌పై ఏమాత్రం ఏకాగ్రత చూపుతాడనే అనుమానాలు నెలకొన్నాయి. కేఎల్ రాహుల్ న్యూజీలాండ్ పర్యటనలో విశేషంగా రాణించాడు. నాలుగో స్థానంలో అతడు వస్తే ఓపెనర్ ఎవరనేది మరో ప్రశ్న? పుజారాకు సమానంగా ఓపికగా బ్యాటింగ్ చేసే క్రికెటర్ కోసం టీమ్ ఇండియా మల్లగుల్లాలు పడుతున్నది. వీరందరికీ కనిపిస్తున్నది సంజూ శాంసన్ ఒక్కడే. మరి అతను కోహ్లీ స్థానాన్ని ఎంత మేరకు భర్తీ చేయగలడనేది ప్రశ్నార్థకమే.

విదేశాల్లో కోహ్లీ రికార్డులు:

– ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన ఏకైన ఆసియా కెప్టెన్ కోహ్లీ
– మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కెప్టెన్‌గా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పింది కోహ్లీనే. 2014లో ఎంసీజీలో అజింక్య రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 262 పరుగులు జోడించాడు.
– విదేశీ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ కోహ్లీ. వెస్టిండీస్‌పై అంటిగ్వాలో 2016లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు
– విదేశాల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్ కోహ్లీనే. 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ.. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు చేశాడు.
– విదేశాల్లో అర్థ సెంచరీలను సెంచరీలుగా మార్చిన ఏకైక కెప్టెన్, 26 అర్థ సెంచరీలు చేయగా.. వీటిలో 14ను సెంచరీలుగా మార్చాడు. మిగిలిన 12 సార్లు మాత్రమే సెంచరీలుగా మార్చలేకపోయాడు.

Advertisement

Next Story

Most Viewed