లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఏం చేయనుంది?

by Anukaran |   ( Updated:2021-05-05 11:31:19.0  )
లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఏం చేయనుంది?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ’వీకెండ్ లాక్‌డౌన్’ పెడితే మంచిదని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, మే నెల 8వ తేదీతో నైట్ కర్ఫ్యూ ముగుస్తున్నందున అప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం నైట్ ర్ఫ్యూ వేళలను పొడిగించే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిమిషాల వ్యవధిలోనే ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ అవసరం లేదని, దానితో వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న రాష్ట్రాలన్నీ పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు అమలుచేస్తున్నా తెలంగాణలో మాత్రం అవి లేకపోవడానికి కారణం కరోనా వ్యాప్తి అదుపులో ఉండడమేనని కితాబునిచ్చారు. ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రకటనలతో మే నెల 8వ తేదీకల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం రాత్రి 9.00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.00 గంటల వరకు కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తుందా లేక ఆంధ్రప్రదేశ్ తరహాలో పగటి సమయంలోనూ కర్ప్యూను అమలు చేస్తుందా అనేది అప్పటికల్లా స్పష్టం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడి రెండు వారాల తర్వాత కోలుకోవడంతో ఒకటి రెండు రోజుల్లోనే సమీక్ష నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశం మేరకే నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని గత నెల 20 నుంచి ప్రభుత్వం అమలుచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అదే కోర్టు పగటి కర్ప్యూ, వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ప్యూ వేళల పొడిగింపు లాంటివి సూచించినందున ఆ దిశగా నిర్ణయం వెలువడే అవకాశాలు లేకపోలేదని సచివాలయ వర్గాల సమాచారం.

పొరుగు రాష్ట్రాలన్నీ పాక్షిక లాక్‌డౌన్‌లో..

తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్రల్లో పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల బంద్ లాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడం కారణంగా ఆ రాష్ట్రాల ప్రభుత్వం ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయి. తెలంగాణలో సైతం కేసులు పెరుగుతున్నా నైట్ కర్ఫ్యూకు మాత్రమే ఆంక్షలు పరిమితమయ్యాయి. పగటి కర్ప్యూ, వీకెండ్ కర్ఫ్యూ ఆలోచనే లేదని ప్రభుత్వం చెప్తున్నా హైకోర్టు సూచన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరింత లోతుగా ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు (ఆర్టీసీ, ప్రైవేటు) పూర్తిగా రద్దయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఆంక్షలు అమలుకానున్నాయి.

పొరుగు రాష్ట్రాల పరిస్థితితో పోలిస్తే తెలంగాణ కాస్త మెరుగ్గా ఉన్నదని, అందువల్ల నైట్ కర్ఫ్యూ కంటే అదనపు ఆంక్షలు అవసరం లేదన్నది సీఎస్ వాదన. గణాంకాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉందని, కరోనా మృతుల లెక్కల్లో తేడాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఒక సాధారణ అభిప్రాయం రాష్ట్రంలో నెలకొనింది. శవాలను కాల్చడానికి శ్మశానాల్లో స్థలం లేకపోవడం, కట్టెల కొరత ఏర్పడడంతో అటవీశాఖ నేరుగా రంగంలోకి దిగి వెయ్యి టన్నుల కట్టెలను సమకూర్చనున్నట్లు పేర్కొంది. ఒకవైపు కరోనా అదుపులో ఉందని, మృతుల సంఖ్య పెద్దగా లేదని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవిక పరిస్థితి, నిర్ణయాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

వైద్య మంత్రిత్వశాఖ బాధ్యతలూ సీఎం దగ్గరే

వారం రోజుల క్రితం వరకూ రాష్ట్రానికి వైద్య మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఆ శాఖ బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నారు. కరోనా బారిన పడడంతో ఇరవై రోజులుగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేయలేదు. టెలిఫోన్‌లోనే సీఎస్‌తో మాట్లాడుతూ తగిన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే వైద్య మంత్రి కావడంతో ఒకటి రెండు రోజుల్లో ప్రగతి భవన్‌లో కరోనాపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో నైట్ కర్ఫ్యూ వేళల పొడిగింపు, వీకెండ్ లాక్‌డౌన్ తదితరాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీ, కేంద్రం నుంచి సమకూర్చుకోవడం, ప్రైవేటు కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయడం, రాష్ట్రంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగానే పంపిణీ చేస్తామన్న ప్రకటనకు కార్యాచరణ ప్రకటించడం లాంటి అనేక అంశాలపై సీఎం కేసీఆర్ వైద్యరోగ్య శాఖ అధికారులతో చర్చించనున్నారు. ఈ నెల 8వ తేదీకల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు డెడ్‌లైన్ పెట్టినందున ఆ లోగానే సీఎం సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed