పెళ్లిళ్లు మూడు వారాల వరకు మాత్ర‘మే’!

by Shyam |
పెళ్లిళ్లు మూడు వారాల వరకు మాత్ర‘మే’!
X

అమరావతి: కరోనా ప్రభావం అనేక రంగాలపైనే కాకుండా వివాహ బంధంతో సరికొత్త జీవితాన్ని ఆరంభిద్దామనుకున్న యువతీయువకులపైనా తీవ్రంగా పడింది. ఈ మహమ్మారి భయంతో వివాహాలన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ పాటికే వివాహ బంధంతో ఒక్కటవ్వాల్సిన వారంతా నిరాశలో మునిగిపోయారు. అలాంటి వారందరికీ షాకిచ్చేలా ఈ నెలాఖరుకు వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ముగియనున్నాయి.

లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లిళ్లు జరిపించుకునేందుకు అనుమతించాలని పోలీసు అధికారులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 30 నుంచి శుక్ర మౌఢ్యం ప్రారంభం కానుండగా, ఆపై శ్రావణ మాసంలోనే ముహూర్తాలు ఉన్నాయి. దీంతో చాలా వరకూ వివాహతంతు ఈ నెలలోనే పూర్తి చేయాలని పలుకుటుంబాలు పట్టుదలగా ఉన్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే వివాహ తంతు పూర్తి చేస్తామని పోలీసులకు చెబుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారు.

ఈ నెలలో 12, 13, 14, 15 తేదీల్లో, ఆపై 23, 24 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెళ్లికి పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటుండగా, గ్రామాల్లోనైతే గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. మార్చి 22 తరువాత వాయిదా పడ్డ వివాహాలన్నీ ఈ మూడు వారాల వ్యవధిలో జరిగిపోతాయని పండితులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, కంటైన్మెంట్ పరిధిలోని పెళ్లిళ్లకు పర్మిషన్లు ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరుడు, వధువు ఒకే జిల్లా వారైతే తహసీల్దార్ స్థాయిలో, వేర్వేరు జిల్లాల వారైతే కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి పత్రాలను పొందాలని చెబుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక, నిబంధనలు పాటిస్తామన్న హామీ పత్రాన్ని ఇచ్చిన వారికే పోలీసులు అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story