ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్

by Shamantha N |
ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభవుతాయని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్ నిశాంక్ సూచనప్రాయంగా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి సిలబస్ కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ‘సిలబస్‌ ఫర్‌ స్టూడెంట్స్ 2020’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనితా కార్వాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిజిటల్‌ తరగతుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కరోనాపై పోరులో భాగంగా మార్చి 16 నుంచి కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, యూనివర్శిటీలు మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు రాబోయే విద్యాసంవత్సరానికి బోధనాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయం తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాం’ అని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed