యూకేలో భారత కంపెనీల భారీ పెట్టుబడులు!

by Harish |   ( Updated:2021-05-04 04:47:04.0  )
యూకేలో భారత కంపెనీల భారీ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌కు చెందిన పలు కంపెనీలు యూకేలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రధాని మోదీ, యూకే ప్రధాని బోరిస్ మధ్య జరగాల్సిన వర్చువల్ సమావేశానికి ముందే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటన విడుదల కావడం విశేషం. వివిధ కంపెనీలు యూకేలో ఇన్వెస్ట్ చేసే వాటి మొత్తం విలువ 1 బిలియన్ పౌండ్లుగా ఉండనుంది. ఈ పెట్టుబడుల్లో భాగంగా దేశీయ దిగ్గజ ఫార్మా కంపెనీ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) యూకేలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేయనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్ తన కొత్త సేల్స్ ఆఫీసుతో పాటు సంస్థ వ్యాపార విస్తరణ కోసం 240 మిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో సుమారు 2,400 కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టనున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

భారత్‌తో కుదురిన 1 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సీరం ఇన్‌స్టిట్యూట్ ఈ పెట్టుబడులు పెడుతున్నట్టు అధికారికంగా స్పష్టం చేసింది. అదేవిధంగా భారత్‌కు చెందిన పలు కంపెనీలు యూకేలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సుమారు 6,500 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని, ఇవి హెల్త్‌కేర్, సాఫ్ట్‌వేర్, బయోటెక్ రంగాల్లోని కంపెనీల్లో ఉంటాయని అక్కడి ప్రభుత్వం వివరించింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టుబడుల ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్ల వ్యాపారానికి అవకాశం ఉంటుందని తెలిపింది. సీరం కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌తో వ్యాక్సిన్‌లకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్, అభివృద్ధి, పరిశోధనలకు జరుగుతాయని, దీనివల్ల కరోనా లాంటి మహమ్మారి వ్యాధులను నియంత్రించేందుకు వీలవుతుందని అక్కడి వెల్లడించింది.

యూకేలో పెట్టుబడులకు భారత్ నుంచి సీరంతో పాటు ప్రముఖ ఆరోగ్య రంగ సంస్థ గ్లోబల్ జీన్ కార్ప్ 59 మిలియన్ పౌండ్లు(రూ. 600 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ ద్వారా 110 నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు లభిస్తాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అలాగే, విప్రో 16 మిలియన్ పౌండ్లు(రూ. 160 కోట్లు), స్టెరిలైట్ టెక్ కంపెనీ 15 మిలియన్ పౌండ్లు(రూ. 150 కోట్లు), క్యూ రిచ్ క్రియేషన్ 54 మిలియన్ పౌండ్లు(రూ. 550 కోట్లు), ఆగ్రో 30 మిలియన్ పౌండ్లు(రూ. 300 కోట్లు)తో పాటు ఇంకా ఇతర కంపెనీలు యూకేలో పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెట్టుబడులకు సంబంధించి వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలపై వర్చువల్ సమావేశంలో సంతకాలు జరగనున్నాయి.

Advertisement

Next Story