టీవీఎస్ మోటార్స్ త్రైమాసిక లాభం రూ.74 కోట్లు!

by Harish |
టీవీఎస్ మోటార్స్ త్రైమాసిక లాభం రూ.74 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. నికర లాభం రూ. 73.87 కోట్లతో 44.82 శాతం క్షీణించినట్టు ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసిక అమ్మకాలలో 30 శాతం తగ్గుదల కారణంగా ఆదాయం తగ్గిందని టీవీఎస్ మోటార్స్ కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 20.59 శాతం తగ్గి రూ. 3,481 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,384 కోట్లను నమోదు చేసింది.

మార్చి త్రైమాసికంలో కంపెనీ తన ఖర్చులను దాదాపు 20 శాతం తగ్గించినట్టు పేర్కొంది. ఇక, మొత్తం ఆర్థిక ఏడాది సంవత్సరానికి కంపెనీ ఆదాయం రూ. 16,423 కోట్లతో 10 శాతం క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సర నికర లాభం రూ. 592 కోట్లతో 12 శాతం తగ్గినట్టు టీవీఎస్ మోటార్స్ వెల్లడించింది. ఖర్చు తగ్గింపు చర్యలను అమలు చేయడం ద్వారా వడ్డీకి ముందు ఆదాయాలు, పన్నులు, తరుగుదల(ఎబిటా) మార్జిన్ 7.9 శాతం నుంచి 8.3 శాతం పెరిగిందని తెలిపింది. బీఎస్6కి వాహనాలను అప్‌గ్రేడ్ చేసే క్రమంలో డీలర్ డిస్కౌంట్ కోసం రూ. 22 కోట్లు, కొవిడ్-19 రిలీఫ్ కింద రూ. 32 కోట్లను కేటాయించినట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్ మొత్తం వాహనాల అమ్మకాలు 17 శాతం తగ్గి 32,63,302 యూనిట్ల విక్రయాలు జరిగినట్టు కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story