కారు జోరు… మినీ పురపోరులో టీఆర్ఎస్ విజయకేతనం

by Shyam |
కారు జోరు… మినీ పురపోరులో టీఆర్ఎస్ విజయకేతనం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మినీ పురపోరులో కారు జోరు కొనసాగింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి పుర పీఠాన్ని చేజిక్కుంచుకుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి అనంతరం పోలింగ్‌ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది లెక్కించారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు వెళ్తున్న కొద్దీ అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గెలిచేదెవరో.. ఓడేదెవరో అని టెన్షన్ కు లోనయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ 18వ వార్డులో బీజేపీకి షాక్ తగిలింది. ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

జీడబ్ల్యూఎంసీ, ఖమ్మం కార్పొరేషన్లు ‘కారు’వే..

మినీ పురపోరులో 248 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు, మున్సిపాలిటీతో పాటు అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన గజ్వేల్ లోని 12వ వార్డు, నల్లగొండ 26వ వార్డు, బోధన్ 18వ వార్డు, పరకాల 9వ వార్డు, జీహెచ్ఎంసీ పరధిలోని లింగోజిగూడ 18వ వార్డుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపుతో పుర పీఠాన్ని చేజిక్కించుకుంది.

టీఆర్ఎస్ హవా

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీఆర్ఎస్ హవా కొనసాగించింది. జీడబ్ల్యూఎంసీలోని 66 డివిజన్లకు 49 సీట్లను కైవసం చేసుకొని రెండోసారి మేయర్ పీఠంపై కూర్చునేందుకు సిద్ధమైంది. బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించి ఉనికిని చాటుకోగా, కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు మూడు స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానానికి పరిమితమైంది. ఖమ్మం కార్పొరేషన్ లో 60 వార్డులకు 43 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకొని కారు జోరును కొనసాగించింది. కాంగ్రెస్ 9 స్థానాలు, సీపీఐ 3, సీపీఎం 2, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానానికే పరిమితమయ్యాయి. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులకు 13 వార్డుల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

కాంగ్రెస్ ఆరు వార్డులు, బీజేపీ ఒక వార్డును గెలుచుకుంది. సిద్దిపేట 43 వార్డులకు 36 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని మునిసిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసింది. ఐదు వార్డుల్లో ఇండిపెండెంట్లు, ఒక్కోటి చొప్పున వార్డుల్లో బీజేపీ, ఏఐఎంఐఎం గెలిచాయి. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. నకిరేకల్ 20 వార్డుల్లో 11 స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు ఒక స్థానంలో గెలిచారు. జడ్చర్ల 27 వార్డులకు 23 స్థానాల్లో గులాబీ శ్రేణులు గెలిచారు. బీజేపీ, కాంగ్రెస్ చెరి రెండు స్థానాలకు పరిమితమయ్యాయి. కొత్తూరు మున్సిపాలిటీ 12 వార్డులకు 7 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపకుండా సున్నాకు పరిమితమైంది. ఇదిలా ఉండగా గజ్వేల్ మున్సిపాలిటీ 12వ వార్డుకు జరిగిన ఆకస్మిక పోరులో టీఆర్ఎస్ గెలిచింది. అలాగే నల్లగొండ 26వ వార్డు, బోధన్ 18వ వార్డులో గులాబీ శ్రేణులు సత్తాచాటారు. పరకాల 9వ వార్డును బీజేపీ, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.

బీజేపీకి.. కాంగ్రెస్ షాక్

జీహెచ్ఎంసీ పరిధిలో లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ షాకిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యర్థి బీజేపీ నాయకుడు అఖిల్ గౌడ్ పై 1,272 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కార్పొరేషన్ సాధారణ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్ రమేష్ మృతిచెందడంతో ఈ డివిజన్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన మరణించడంతో సానుభూతిగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలపడం లేదని ప్రకటించింది. బీజేపీ నుంచి పోటీ చేసిన అఖిల్​గౌడ్​కు 5,968 ఓట్లు రాగా.. రాజశేఖర్​ రెడ్డికి 7,240 ఓట్లు వచ్చాయి.

గెలుపు సంబురాలు చేసుకున్న అభ్యర్థిపై కేసు

కొవిడ్ నేపథ్యంలో గెలుపు సంబురాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించింది. అయినా అవేమీ తమకు పట్టవన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల విజయోత్సవాలు జరుపుకున్నారు. అయితే సిద్దిపేటలో రంగులు చల్లుతూ సంబురాలు జరుపుకున్న తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి పస్కల సతీశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సిద్దిపేటలో అధికారులు మొదటి రౌండ్ ఫలితాలు విడుదల చేసిన జాబితాలో తప్పులు దొర్లాయి. 13వ వార్డుకు టీఆర్ఎస్ అభ్యర్థి రాపెల్లి విఠోభ గెలుపొందగా ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పత్రి శ్రీనివాస్ యాదవ్ గెలుపొందినట్టు పేరు ప్రచురించారు.
దీంతో అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

మినీ పురపోరులో లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నామని, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి వెల్లడించారు. సోమవారం ఉదయం పలు అంశాలను వివరించారు. కరోనా నేపథ్యంలో పుర ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై పోలీసులు కూడా నియంత్రణ చేయాలని లేదంటే సంబంధిత ఏరియాలో పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియను ఎస్ఈసీ కార్యాలయం నుంచి మానిటరింగ్​ చేస్తున్నట్లు పార్థసారథి వివరించారు.

Advertisement

Next Story