అభివృద్ధి మంత్రం ఓట్లురాల్చేనా..?

by Anukaran |
అభివృద్ధి మంత్రం ఓట్లురాల్చేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: పది రోజులుగా నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం రెండు కంటే ఎక్కువ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొంటూ హడావుడి చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట ప్రజల్లో ఉండేలా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అధికార పెద్దలు పర్యటిస్తున్నారు. పండుగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపే ప్రధాన పనులను ప్రారంభించి.. పని చేస్తాం అని చెప్పుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అయితే శంకుస్థాపనలు గత హామీలను మరిపిస్తాయా..! ఇటీవల భారీ వర్షాల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలను ప్రజలు మర్చిపోయాలా చేస్తాయా..? వీటికి గ్రేటర్​ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాలి.

గ్రేటర్ ఎన్నికలకు అంతా సిద్ధమైన సందర్భంలో అధికార పార్టీ స్థానిక ప్రజలకు చెప్పుకునేలా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. నోటిఫికేషన్ వస్తే శంకుస్థాపనలకు, హామీలను ఇచ్చేందుకు అవకాశం ఉండదు. దీపావళి తర్వాత వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సంకేతాలు ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు చేపట్టేలా అధికార పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పలు హామీలనిచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ నగరంలో ఎక్కడో ఒకచోట శంకుస్థాపనలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. తద్వారా విరివిగా చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పుకొని ఓట్లు రాబట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. నగరంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతున్నప్పటికీ, కాలనీల్లో ఉన్న ప్రజలతో వాటికి నేరుగా సంబంధం లేదు. దీంతో ఎన్నికల వేళ బస్తీలు, కాలనీల్లోనూ ప్రజలకు కనిపించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.

వరుసగా అభివృద్ధి పనులు

గ్రేటర్ బస్తీల్లో ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు మంత్రులు, మేయర్ కలిసి తాజాగా 24 బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. నెల రోజుల్లో మరో 50 దవాఖానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో చెత్త ఒకటి. చెత్తను తొలగించేందుకు అత్యాధునిక 50 కంప్యాటర్ వాహనాలకు సైతం పచ్చజెండా ఊపారు. శ్మశాన వాటికల అభివృద్ధిపైనా కూడా అధికార పార్టీ దృష్టి సారించింది. బ‌ల్కంపేట, గోప‌న‌ప‌ల్లి, జేపీకాల‌నీ, తారాన‌గ‌ర్, మియాపూర్ (ముస్లిం), మూసాపేట్, గౌతమ్‌న‌గ‌ర్ (ముస్లిం), గౌత‌మ్‌న‌గ‌ర్ (హిందూ), ఎస్‌పీ న‌గ‌ర్ (హిందూ), మ‌చ్చబొల్లారం (హిందూ), రాంరెడ్డి న‌గ‌ర్ (ముస్లి), పంజాగుట్ట, దేవునికుంట, దోమ‌ల్‌గూడ వినాయ‌క్‌న‌గ‌ర్, శివ‌రాంప‌ల్లి గ్రేవ్‌యార్డ్ , అంబ‌ర్‌పేట్ మోహినిచెరువు, మోక్షవాటిక, మ‌ల్లాపూర్ హిందూ గ్రేవ్‌యార్డ్, జ‌మాలీకుంట, సీతాల్‌మాత, తారాన‌గ‌ర్ (హిందూ), సాయిన‌గ‌ర్ లాలాపేట, క్రిస్టియ‌న్ గ్రేవ్‌యార్డ్‌లను ఇప్పటికే అభివృద్ధి పరిచారు. ఇంకా ఇతర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా ఆయా సామాజిక తరగతుల ఓట్లను కాపాడుకునే వ్యూహాలను చేస్తోంది. సీసీ రోడ్లు, బస్టాండ్‌లు, చెరువుల సుందరీకరణ పనులను కొనసాగిస్తున్నారు.

గత వైఫల్యాలను మరిపిస్తాయా..

నగరంలో విస్తృతంగా చేపడుతున్న ప్రారంభోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ గత వైఫల్యాలను మరిపిస్తాయో వేచి చూడాలి మరి. నగరంలో 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చినా గడిచిన ఆరేండ్లలో 224 మాత్రమే పూర్తి చేయగలిగింది. ఏసీ బస్టాండ్లు నగరమంతా నిర్మించి, వాటిల్లో ఏసీ సౌకర్యం కల్పిస్తామన్న హామీలు సైతం అటకెక్కాయి. నగరంలో మొత్తం ఏసీ బస్టాండ్లు చూసినా పదుల సంఖ్యల్లోనే ఉన్నాయి. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరికీ తెలియదు. ఇటీవల కురిసిన వర్షాల సమయంలోనూ ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ విభాగం పూర్తిగా విఫలమయ్యాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పటికీ కనిపిస్తోంది. వారాల వ్యవధిలోనూ ఎన్నికలు వస్తుండటంతో ఆ ప్రభావం ఓట్లలో వ్యక్తమవుతుందా.. లేక ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సానుకూలంగా మారుతాయా తేలాల్సి ఉంది.

ఆగిన పనులకు మోక్షం

ప్రతిపాదనలు, బడ్జెట్, ఇతర సమస్యలతో ఆగిపోయిన పనులకు సైతం ఇప్పుడు మోక్షం కలుగుతోంది. చిన్నా,పెద్ద పనులంటూ లేకుండా అన్నిటికీ ముహూర్తం పెట్టేస్తున్నారు. స్థానిక ప్రజల్లో పట్టు సంపాదించుకోవాలంటే లోకల్‌గా ఏదో పనులు చేయాల్సిందే.. నోటిఫికేషన్ రాకముందే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో రిబ్బన్ కట్ చేసేలా అధికార పార్టీ ప్రణాళికలు రచించింది. దీపావళి పండుగ రోజు కూడా నగరంలో నాలుగు చోట్ల పనులను ప్రారంభించేందుకు నగర మేయర్ సిద్ధమయ్యారు. సుమారు 10 రోజులుగా సిటీ నలువైపులా ప్రాంతాల్లో పనులను చేపడుతూ, వాటికి నిధులు కేటాయిస్తూ అధికార పార్టీ ముందుకు వెళ్తోంది. కొన్ని పనులకు హామీలను కూడా ఇచ్చేశారు. వీటినే రేపు ఎన్నికల ప్రచారంలో ఉపయోగపడేలా మార్చుకోవాలని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed