కేటీఆర్ భార్యపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

by Anukaran |
TPCC Chief Revanth Reddy, KTR, kalvakuntla shailima
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉన్నతాధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎస్‌తో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. రియల్టర్లను సిండికేట్ చేసే టీఆర్‌ఎస్ కార్యకర్తలా మారారని, దీంతో వేల కోట్ల భూములను తక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మైహోం రామేశ్వరరావు కుటుంబానికి చెందిన కంపెనీలకు సీఎం కేసీఆర్ కోకాపేట భూములను వేలంలో తక్కువ ధరకే కట్టబెట్టారని, కోకాపేట భూముల వేలంలో స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ భూముల వేలంపై కాంగ్రెస్‌ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తోందని, 30 కోట్లకే ఎకరా భూమి అమ్మడం దారుణమన్నారు. ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని, కానీ రూ.2 వేల కోట్లే వచ్చిందని మండిపడ్డారు. గతంలో అమ్మకుండా మిగిలిపోయిన 50 ఎకరాల భూమిని కేసీఆర్ అక్రమంగా విక్రయించారని, టెండర్లపై ప్రెస్‌నోట్‌ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు.

సంబంధిత శాఖాధికారులు, మంత్రులు ఎందుకు మాట్లాడలేదని, తనను తిట్టడానికే వారు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​నేతలు కోకాపేట్ భూముల పరిశీలనకు వెళ్తే విచరక్షణారహితంగా కొట్టి అరెస్ట్​చేశారని, పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులా..? ప్రైవేట్ సైన్యమా? అని ప్రశ్నించారు. ఎంపీ సంతోష్​రావు తన బంధువు సందీప్​రావు ద్వారా ఎస్‌ఓటీ పోలీసులతో కొట్టిస్తున్నాడని, గడీల దొరలను ఉరికించినట్లుగా కేసీఆర్‌ను ఉరికించే పరిస్థితి వస్తుందని ఫైర్​అయ్యారు. కోకాపేట భూములను కొనుగోలు చేసిన కంపెనీలను వదిలిపెట్టమని, కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని రేవంత్​రెడ్డి ప్రకటించారు. సోమేశ్​కుమార్​బీహార్​నుంచి వచ్చిన ప్రైవేట్ సైన్యమని, సోమేశ్, అర్వింద్, ఐపీ ప్రభాకర్​రావులు దోపిడీకి జవాబు చెప్పాలన్నారు. తెలంగాణలో వచ్చేది సోనియమ్మ రాజ్యమేనని, కాంగ్రెస్​ ప్రభుత్వంలో విచారణను ఎదుర్కొవాల్సి వస్తుందని సూచించారు.

అందుకే సాష్టాంగ నమస్కారం

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సాష్టాంగ నమస్కారం వెనక భూ కుంభకోణం ఉందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇంతస్థాయిలో ఆరోపణలు వస్తున్నా ఎందుకు సంబంధిత అధికారులు, మంత్రులు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ భార్య కల్వకుంట్ల శైలిమకు ఐకియా పక్కన 7621 గజాల భూమి ఉందని, దీన్ని శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు చెందిన శ్రీధర్‌కు డెవలప్​మెంట్ కింద ఇచ్చారని, సీలింగ్ ల్యాండ్‌ను తక్కువ ధరకే రెగ్యులరైజ్ చేసారని ఆరోపించారు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో కేటీఆర్ తాను తేలుకుంట్ల శ్రీధర్ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నట్లు సూచించారని, భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా తేలుకుంట్ల శ్రీధర్ ద్వారా కేటీఆర్ దోపిడి చేస్తున్నారని వెల్లడించారు. దోచుకున్న డబ్బంతా మళ్ళీ శ్రీధర్ నుంచి కేటీఆర్‌కే వస్తాయని, కోకాపేట్ భూమి అంతా గతంలో యూనిటెక్ కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ దివాళా తీయడంతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆస్తులు అమ్మి యునిటెక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వాలని సచించారని, కానీ నిబంధనలకు విరుద్ధంగా యునిటెక్ కంపెనీని ప్రెస్టేజ్ కంపెనీ కొనుగోలు చేసిందని వివరించారు. ఏదైనా భూమిని డెవలప్‌మెంట్ కింద ఇస్తే 50:50 శాతం ఉంటుందని, కానీ, ఇక్కడ భూమి కొనుగోలు చేసిన వారికి 25శాతం, డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న వారికి 75శాతం ఇచ్చారన్నారు.

రాష్ట్ర వారసత్వ సంపదను అందినకాడికి అమ్ముతున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెయ్యికోట్ల కుంభకోణంపై వివరణ ఇస్తారని ఆశించామని, బంగారం కంటే విలువైన భూములను అమ్ముతూ.. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దివాళా తీయిస్తుందని దుయ్యబట్టారు. ఆనాడు ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్ భూములను అమ్మాలని చూస్తే కేసీఆర్ అడ్డుపడ్డారని, సీమాంధ్ర సీఎంలు భూములు అమ్మడానికి భయపడ్డారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, నర్సింగిలో పేదలకు కేటాయించిన భూములను కేసీఆర్ అమ్ముతున్నారని, ప్రెస్టేజ్ ఎస్టేట్, శ్రీచైతన్య కంపెనీ కూడా 15 ఎకరాలు కొనుగోలు చేశాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో భూ అమ్మకాల్లో జరుగుతున్న వ్యవహారాన్ని బీజేపీ ముందు ఉంచుతామని, వాళ్లు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని, లేకుంటే న్యాయస్థానాలకు వెళ్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తన ఆరోపణలపై ఒక్క ఆధారం తప్పు ఉన్నా ఎన్ని కేసులైనా పెట్టుకోవాలంటూ సూచించారు. ఇక్కడి దళితులకు అన్యాయం చేసి హుజురాబాద్ ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారని, కోకాపేటలో 260 మంది దళితులకు కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చిందన్నారు.

Advertisement

Next Story