గొప్పలకు పోయి తిప్పలు పడుతోన్న జీహెచ్ఎంసీ!

by Shyam |
గొప్పలకు పోయి తిప్పలు పడుతోన్న జీహెచ్ఎంసీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏదైనా ఎన్నికల ముచ్చటే. ఓట్ల కోసం గొప్పలే. అన్ని చేశాం.. ఇంకా చేస్తామనే బిల్డప్‌లే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన సిత్రాలు అన్ని.. ఇన్ని కావు. పనులు కాకపోయినా అయినట్లు, ప్రారంభించకపోయినా ప్రారంభించినట్లు చూపింది. దీనికి నిదర్శనమే గ్రేటర్ లోని పబ్లిక్ టాయిలెట్లు. ఎన్నికలెప్పుడొచ్చినా.. మహానగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. అంటే ఉన్నవాటికి అదనంగా నిర్మిస్తున్నారనుకుంటే పొరపాటే. ఒకసారి ప్రారంభించిన మరుగుదొడ్లనే, మళ్లీ నిర్మిస్తున్నట్టు చెప్పుకోవడం ఎంఏయూడీకి పరిపాటిగా మారిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే అందుబాటులోకి తెచ్చినట్టు ప్రచారం చేసుకున్న పబ్లిక్ టాయిలెట్లను ఇప్పుడు నిర్మిస్తున్నట్టు మళ్లీ చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నా.. అందుబాటులోకి రాని పబ్లిక్ టాయిలెట్లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి.

అంతుబట్టని టాయిలెట్ల గణంకాలు

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని టాయిలెట్లు ఉన్నాయో.. వాటిలో అందుబాటులోకి వచ్చినవి, నిర్మాణ దశలో ఎన్ని ఉన్నాయో చెప్పే అధికారులెవ్వరూ బల్దియా కార్యాలయంలో లేరంటే అతిశయోక్తి కాదు. 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం జీహెచ్ఎంసీ సమర్పించిన వివరాల ప్రకారం నగరంలో 1,548 పబ్లిక్ టాయిలెట్ యూనిట్ల వసతి ఉన్నట్టు పేర్కొన్నారు. గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రజలకు చెప్పుకునేందుకు ఎంఏయూడీ టాయిలెట్లను విస్తృతంగా ప్రచారం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది రకాల డిజైన్లతో 7,200 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీకి లక్ష్యంగా నిర్ణయించింది. గత ఆగస్టు 15 నాటికే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటికే 1,536 ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయగా.. 4,271 మ‌రుగుదొడ్ల నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయని బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ అప్పట్లో చెప్పారు. బీఓటీ ప‌ద్ధతిలో ‌నిర్మిస్తున్న ప‌బ్లిక్ టాయిలెట్లను 10 ఏళ్ల పాటు నిర్వహించే బాధ్యత‌ను సంబంధిత ఏజెన్సీల‌కే అప్పగించేందుకు ఎంఏయూడీ నిర్ణయించింది. అదే లక్ష్యాన్ని అక్టోబర్ 2 నాటికి పూర్తి చేస్తామని ఎంఏయూడీ అధికారులు మరోసారి ప్రకటించారు. బల్దియా ఎన్నికలకు ముందు హడావిడిగా సుమారు మూడు వేల ఇన్‌స్టంట్ టాయిలెట్ యూనిట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అయితే వాటిల్లో వాటర్, కరెంట్ సదుపాయాన్ని కల్పించలేదు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోయినా గ్రేటర్ పరిధిలో పదివేల టాయిలెట్లను ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినట్టు ఊదరగొట్టారు. అయితే ఇటీవల జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ర్యాంకింగ్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్రేటర్‌లో 5,295 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. అన్ని జోన్లలో కలిపి బీఓటీ పద్ధతిలో నిర్మించినవి కేవలం 192 మాత్రమే.. గత ఆగస్టు కంటే ముందున్న 1,548తో కలుపుకుంటే 3,747 టాయిలెట్లను మాత్రమే ఏడాది కాలంలో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఏడాది కాలంలో రెండు సార్లు లక్ష్యాన్ని మార్చుకున్నా ఎంఏయూడీ గడువు దాటి ఆరు నెలలైనా ఏడు వేల టాయిలెట్లను పూర్తి చేయలేకపోయింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు మరోసారి సిద్ధం..

హెచ్ఎంసీ ఎన్నికల ముందు నగరంలో మూడు వేలకు పైగా టాయిలెట్ డబ్బాలను సర్కిళ్లు, ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేశారు. ఎలాంటి వసతులు కల్పించకపోయినా ప్రారంభించినట్టు పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ ప్రచారం చేసింది. పని పూర్తి చేశామని చెప్పుకునేందుకు హడావిడిగా.., ఇష్టారీతిగా టాయిలెట్లను రోడ్డుపక్కన ఇన్‌స్టాల్ చేశారు. ఎలాంటి ప్రాతిపదికన లేకపోవడం, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు కంటే ఎక్కువ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. అయితే వాటిల్లో నీరు, కరెంట్ సౌకర్యం కల్పించలేదు. సాధారణంగా కిలోమీటర్ పరిధిలో 2-3 ప్రదేశాల్లో టాయిలెట్లు ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంచనా. జనాభా గణంకాలు లేదా ప్రజలకు సౌకర్యం వంటి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా టాయిలెట్లను ఇన్‌స్టాల్ చేసి వెళ్లిపోయారు. వీటని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేకపోవడంతో మందుబాబులకు, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది.

మళ్లీ.. మళ్లీ

ఏడాదిన్నర గడిచినా పూర్తి కాని టాయిలెట్లను మరోసారి నిర్మిస్తున్నట్టు జీహెచ్ఎంసీ చెబుతోంది. బల్దియా ఎన్నికల కంటే ముందే ఏర్పాటు చేసిన టాయిలెట్లపై నిర్మాణంలో ఉన్నాయంటూ ఫ్లెక్సీలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిన్నర దాటినా టాయిలెట్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి పబ్లిక్ టాయిలెట్లను ప్రచారంలోకి తెస్తూ ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవంలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు.

Advertisement

Next Story