తల్లి ప్రేమ దక్కదని..15 ఏళ్లకే హత్య

by Anukaran |   ( Updated:2020-09-10 05:52:42.0  )
తల్లి ప్రేమ దక్కదని..15 ఏళ్లకే హత్య
X

దిశ, వెబ్‎డెస్క్:ప్రేమ. ఎవరైనా.. ఎక్కడైనా.. ఎవరికైనా పంచవచ్చు. కానీ దానిని అవతలి వాళ్లు అర్థం చేసుకునే విధానం పాజిటివ్ గా ఉండాలి. ఓ 15 ఏళ్ల బాలిక తన తల్లి మరో చిన్నారిపై చూపిస్తున్న ప్రేమను చూసి తట్టుకోలేకపోయింది. తన తల్లి ప్రేమ తనకే సొంతమని, మరెవరికి పంచకూడదని ఈర్ష్య పడింది. ఆ ఆలోచనే ఆమెను హత్య చేసేలా చేసింది. మైనార్టీ కూడా తీరని ఆ బాలిక.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. తన ప్రేమ కోసమని మరో తల్లికి బిడ్డ ప్రేమను దూరం చేసింది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం టి.శాసనాం గ్రామంలో హేమశ్రీ (11 నెలల చిన్నారి) నీళ్ల ట్యాంకులో శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చిన్నారిది సహజ మరణం కాదని హత్య అని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం..

గ్రామానికి చెందిన నిర్మల పక్కింట్లో ఉండే పాప(హేమశ్రీ)పై ప్రేమ చూపేది. అయితే తన తల్లి పక్కింటి చిన్నారిపై ప్రేమ చూపించడాన్ని నిర్మల కూతురు(15) తట్టుకోలేకపోయింది. ఇదే క్రమంలో కూతురు రోజు ఫోన్‎లో మాట్లాడడం చూసి తల్లి మందలించింది. దీంతో తనపై తల్లికి ప్రేమ తగ్గిపోతుందని భావించింది. ఇదంతా హేమశ్రీపై ఉన్న ప్రేమతోనే అని ఆ చిన్నారిపై ద్వేషం పెంచుకున్నది. పాపను ఆడిపిస్తూ.. ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకులో పడేసింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా బాలిక కుట్ర బయటపడింది. కేవలం తన తల్లి ప్రేమకు దూరం అవుతాననే బాధతోనే బాలిక హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story