- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ గీతం.. సంపూర్ణ భోజనం
దిశ, కరీంనగర్: సమయం ఉదయం గం.11.30 నిమిషాలు. కొంతమంది సర్దార్‌జీలు ఓ చెట్టు కింద చకాచకా టేబుళ్లు ఏర్పాటు చేసి కొన్ని పాత్రల్లో వంటకాలు తెచ్చిపెట్టారు. అలవాటు ప్రకారం కొంతమంది జనం కూడా అక్కడకు చేరుకున్నారు. అంతలోనే ఓ సైరన్ మోగింది. అంతే.. అందరూ అలర్టయ్యారు. సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భోజనాన్ని తిని వెళ్లిపోయారు. ఇది ఎక్కడో కాదు.. కరీంనగర్ పట్టణంలో. లాక్‌డౌన్‌లో భోజనానికి ఇబ్బందిపడుతున్న వారికి ఉచిత భోజనాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కరీంనగర్ గురుద్వార్ ప్రభందక్ కమిటీ. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టి 70 రోజులుగా ఆ మాధవుని సన్నిధిలోనే వంటలు రెడీ చేసి అభాగ్యులను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.
లాక్‌డౌన్ అమల్లోవున్న ఈ సమయంలో తిండి దొరక్క అవస్థలు పడే వారిని దృష్టిలో పెట్టుకుని భోజనం ఏర్పాటు చేయాలని గురుద్వార్ ప్రభందక్ కమిటీ నిర్ణయించింది. అయితే అంతకుమునుపే వీరు ప్రతి ఆదివారం లంగర్ హాల్‌లో భోజనాలను అందించే ఆనవాయితీని కొనసాగిస్తుండేవారు. అదే స్ఫూర్తితో లాక్‌డౌన్ సమయంలోనూ అన్నార్థులను ఆదుకోవాలని నిర్ణయించి ఆ దిశగా ముందుకు సాగుతూ దాతృత్వాన్ని చాటుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 11.30 గంటల నుంచి మ.1.30 గంటల వరకు మార్వాడి మందిర్ సమీపంలో వంటకాలను సిద్ధం చేసి ఉంచుతారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు లంగర్ హాల్‌లో భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వకముందు రెండు పూటలా భోజనం అందించినప్పటికీ ఇప్పుడు ఒక పూట భోజనం అందిస్తున్నారు. కాగా రోజూ 5 వందల మంది వరకు ఇక్కడ భోజనం చేస్తున్నారు.
సేవలోనూ…
గురుద్వార్ ప్రభందక్ కమిటీ ఇచ్చిన పిలుపునందుకుని నగరంలోని సిక్కు యువత.. అక్కడే ఉంటూ సేవలందిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దలు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. గురుద్వార్ సాక్షిగా పేదల కడుపు నింపేందుకు నడుం బిగించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
జాతీయ గీతం తరువాతే.. : సర్దార్ రవిందర్ సింగ్, మాజీ మేయర్
లాక్‌డౌన్ టైమ్‌లో గురుద్వార్ ప్రభందక్ కమిటీ ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భోజనం చేసే ముందే జాతీయ గీతం పాడే విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొడుతూ జాతీయ గీతాన్ని పాడాల్సిందే. నిత్యం ఐదు వందల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నాం. అన్నార్థులను ఆదుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. క్రిటికల్ టైమ్‌లో సేవా భావంలోనూ ముందుంటామని కరీంనగర్ సిక్కు జాతి ప్రాక్టికల్‌గా నిరూపించింది.
అంతా మేమే.. : రాజేందర్ సింగ్, కమిటీ ఉపాధ్యక్షులు
భోజనం అందించాలని కమిటీ సంకల్పించడం మొదలు.. అందరూ కష్టపడి పనిచేసేందుకు ముందుకొచ్చారు. పేదలకు బాసటగా నిలిచేందుకు సిక్కు సమాజంతోపాటు యువత ఈ మహత్కార్యంలో నిమగ్నమైంది. కూరగాయల కటింగ్ నుంచి వంటలు చేయడం, భోజనం అందించడం వరకు ప్రభందక్ కమిటీ ఇచ్చిన పిలుపునందుకుని ప్రతి ఒక్కరూ సేవలు అందిస్తున్నారు.
ఎవ్వరైనా వచ్చి తినొచ్చు.. : బల్వీందర్ సింగ్, ఉపాధ్యక్షుడు
లంగర్ హాల్‌లో ఏర్పాటు చేసిన భోజనం.. ఏ మతానికి చెందిన వారైనా తిని వెళ్లొచ్చు. ఆకలితో ఉన్న వారెవరైనా నేరుగా వచ్చి భోజనం చేయవచ్చు. ప్రతి ఒక్కరూ కష్టపడేది జానెడు పొట్ట కోసమే కదా.. లాక్‌డౌన్ సమయంలో బుక్కెడన్నం దొరకని పరిస్థితిని గమనించే మా కమిటీ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.