పొంచి ఉన్న ప్రమాదం.. అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతి..

by Shyam |   ( Updated:2021-09-05 05:10:10.0  )
పొంచి ఉన్న ప్రమాదం.. అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతి..
X

దిశ, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో గల రంగయ్యపల్లి శివారులో వర్షాల తాకిడికి గుంత ఏర్పడింది. ప్రయాణికులకు ప్రమాదంగా రోడ్డు పై ఏర్పడిన గుంత చుట్టూ అధికారులు కంచె వేసినప్పటికీ, ఇంతవరకు ఆ గుంతకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు అధికారులు చేపట్టలేదు. దీంతో ఈ రహదారి పై ప్రయాణం చేస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంత ఏర్పడి 15 రోజులు గడుస్తున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రాత్రి అజాగ్రత్తగా ఈ రహదారి వెంబడి ప్రయాణిస్తే మాత్రం ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కాగా ఈ రహదారి పక్కనే రెండు వ్యవసాయ బావులు ఉండడంతో ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో ఈ వ్యవసాయ బావిలో ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి పడి మరణించారు. అయినప్పటికీ ఆర్అండ్‌బీ అధికారులు స్పందించడం లేదు. రహదారి పక్కన ఉన్నటువంటి బావులను పూడ్చాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, అధికారులు బావులను పూడ్చడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రహదారిపై ఏర్పడ్డ గుంతకు మరమ్మత్తులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


అధికారులకు చెప్పిన స్పందించడం లేదు

-సర్పంచ్ సంధ్యారాణి

రహదారి విషయమై ఆర్అండ్‌బీ డీఈఈకి ఎన్నిమార్లు విన్నవించినా స్పందించడం లేదని రంగయ్యపల్లి గ్రామ సర్పంచి తన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై గుంతపడి దాని వలన ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పినా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.


ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహదారి వెంట ప్రయాణించాల్సి వస్తుందని రేపాక గ్రామస్తుడు గొల్ల బాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గుంతను అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలన్నారు.

Advertisement

Next Story