రిజర్వాయర్‌లు, ప్రాజెక్టుల్లో పూడికతీతకు టెండర్లు పిలవండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-11-25 16:43:29.0  )
రిజర్వాయర్‌లు, ప్రాజెక్టుల్లో పూడికతీతకు టెండర్లు పిలవండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పూడికతీతను చేపట్టాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ల ను వెంటనే పిలవాలని ఆయన సూచించారు. పూడికతీత పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఆర్థిక వృద్ధికి నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతతో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను సత్వరమే పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామా ప్రాజెక్టు టెండర్ పనులను వేగవంతం చేయాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పరిపాలన పరమైన అనుమతులు, ఇతర కారణాలతో పనులు జాప్యం కాకుండా చూడాలన్నారు.

అధికారులకు ఇందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మోడికుంట వాగు అంచనాలను రూపొందించాలని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూ సేకరణ పై రీలిఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్ భూ సేకరణపై సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. త్వరలో చేపట్టబోయే భూ సేకరణ కు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదిక ను అందించాలని సూచించారు. ఈనెల 27న సింగూరు ప్రాజెక్టు పనులపై సమీక్షించనున్నట్లుగా, ఈ సమావేశంలో జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖలో నియమించనున్న లష్కర్ నియామకం, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో నల్గొండ జిల్లాలో పర్యటిస్తారని, ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన సమగ్ర వివరాలతో నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాకు చెందిన ప్రాజెక్టుల వారీగా పురోగతి, నిధుల అవసరాలు, భూసేకరణ అడ్డంకులు, ఇతర అవరోధాలపై వివరాలను క్రోడీకరించాలని ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed