టార్గెట్ కాంగ్రెస్.. ఖాళీ చేయంచడమే బీజేపీ ఎజెండానా?

by Shyam |
టార్గెట్ కాంగ్రెస్.. ఖాళీ చేయంచడమే బీజేపీ ఎజెండానా?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. 2018 శాసన సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా కోల్పోయి.. ఒకే స్థానంతో సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, రెండేండ్ల కాలంలోనే ఎంతో పురోగతి సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 49 స్థానాలను కైవసం చేసుకుని, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో అనూహ్య విజయం సాధించి, అదే ఊపును గ్రేటర్ ఎన్నికల్లో కొనసాగించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఎలాగైనా విజయం సాధించాలని తహతహలాడుతోంది. అంతేగాకుండా బీజేపీ విజయం సాధించకపోయినా పర్వాలేదు కానీ, కాంగ్రెస్‌ను మాత్రం గెలవనివ్వబోమని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. మరి సాగర్‌లో బీజేపీ ఏ రకమైన వ్యూహం రచిస్తుందో చూడాలి.

మరోపక్క.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వరుస కష్టాలు ఎదురౌతున్నాయి. అసలే ఓటములతో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి వలసలు మరో తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ అగ్రనేతలను బీజపీ టార్గెట్ చేసి, భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని కోలుకోనివ్వకుండా చేయాలన్న లక్ష్యంతోనే పావులు కదుపుతుందన్నదని స్పష్టంగా అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అనేక చోట్ల ఓటమి పాలు కావడం ఒక కారణమైతే, పీసీసీ చీఫ్ ఎంపిక మరో కారణం. ప్రస్తుత పీసీసీ చీఫ్ మూలంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అధ్యక్షుడి వైఫల్యంతో పార్టీ కోలుకోలేని స్థితికి చేరుకుందని, ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పలుసార్లు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇలాంటి అసంతృప్తి నేతలపై కన్నేసిన బీజేపీ వారి వీక్‌నెస్‌‌‌లపై దెబ్బకొడుతోంది.

అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కాంగ్రెస్ అసంతృప్తి నేతలపై ఆరా తీస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో మూడో స్థానానికి చేరుకున్న కాంగ్రెస్ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా తీవ్రంగా దెబ్బపడింది. కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో బీజేపీ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని కీలక నేతలను ఒక్కొక్కరినీ బీజేపీ వైపుగా నడిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా ఉన్న విజయశాంతిని బీజేపీ వైపుగా మళ్ళించడంతో కమలదళం ఫుల్ సక్సెస్ అయింది. పనిలో పనిగా మరో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. 2023 లోగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసి, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యహం రచించినట్టు తెలస్తోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో దెబ్బకొడుతున్నారు. అందులో భాగంగానే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి రుచి చూచించారు. ఇదే అదునుగా భావించి, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతూ.. కాంగ్రెస్‌ను ఖాళీ చేయించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా 2023లో అధికారంలోకి రావాలని చూస్తోంది. మరి బీజేపీ దూకుడు ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

Next Story