కరోనా ఎఫెక్ట్.. ఏపీలో వంతుల వారీ పని విధానం

by srinivas |
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో వంతుల వారీ పని విధానం
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సరికొత్త నిర్ణయంతో ఉద్యోగులకు ఉపశమనం కలిగించింది. జనతా కర్ఫ్యూను పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులతో పాటు మున్సిపల్ ఉద్యోగులను కూడా బృందాలుగా విభజించి వలంటీర్ల సాయంతో విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేస్తోంది. అనుమానితుల బంధువులకు కూడా పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఉద్యోగులు ఒత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వంతుల వారీగా విధుల విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.

ఏపీలో ఉన్నతాధికారులు మినహా మిగిలిన ఉద్యోగులందరినీ రెండు బృందాలుగా విభజించనుంది. ఈ రెండు బృందాల్లో ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తే, రెండో బృందం తర్వాత వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తుంది. అయితే వారం కార్యాలయానికి రాకుండా ఇంటిపట్టున ఉండేవారు అక్కడి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కరోనాకు విరుగుడు సామాజిక దూరం పాటించడం మాత్రమే పరిష్కారం అన్న నిపుణుల సూచనలతో వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్ని కూడా నియంత్రించాలని నిర్ణయించింది. అత్యవసర పని ఉంటే తప్ప కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరాదన్న నిబంధన తీసుకురానుంది. రాష్ట్ర సచివాలయంలో విభాగాధిపతి (సెక్షన్‌ ఆఫీసర్‌) కంటే పై స్థాయి అధికారులు మాత్రమే రోజూ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

సెక్షన్ ఆఫీసర్లందరికీ ప్రత్యేక ఛాంబర్లు ఉన్న నేపథ్యంలో వారికి వంతుల వారీ విధానం అమలులో ఉండదని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా సచివాలయ ఉద్యోగులంతా ఒకేసారి కాకుండా మూడు సమయాల్లో విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. తొలి బృందం ఉదయం 9.30 గంటలకి, రెండో బృందం 10గంటలకి, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. లేదంటే టీమ్ టీమ్‌కి మధ్య గంట విరామం ఉండేలా చర్యలు తీసుకోవచ్చు. అది విభాగాధిపతి నిర్ణయం అని ప్రభుత్వం భావిస్తోంది.

జిల్లా స్థాయి కార్యాలయాల్లో కూడా ఇదే విధానం అమలు కానుంది. గెజిటెడ్‌ అధికారులు, అంతకు పైస్థాయి అధికారులు రోజూ విధులకు హాజరుకావాల్సి ఉండగా.. కింద స్థాయి సిబ్బంది మాత్రం వంతులవారీగా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. డివిజన్‌, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వంతులవారీ విధుల విధానం అమలు చేయనున్నారు.

Tags: andhra pradesh, new working style, government, employees, govt staff

Advertisement

Next Story

Most Viewed